FTX founder arrest | దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్.. బహామాస్‌లో అరెస్టయ్యాడు. అమెరికా ప్రాసిక్యూటర్లు నేరారోపణలు దాఖలు చేసి ఫ్రైడ్‌ను అరెస్టు చేయించారు. బహమాస్ నుంచి అమెరికాకు రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాన్హాటన్లోని అమెరికా అటార్నీ కార్యాలయం ప్రతినిధి బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ అరెస్టును ధ్రువీకరించారు.
ఎఫ్‌టీఎక్స్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్రైడ్ 16 బిలియన్ డాలర్ల సంపద జీరో అయింది. ఒక దశలో ఆయన నికర విలువ 26 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. లిక్విడిటీ క్రంచ్ తర్వాత ఎఫ్‌టీఎక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ దివాలా తీయడమే నికర విలువ తగ్గడానికి కారణమైంది. ఎఫ్‌టీఎక్స్ సంస్థ ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రిప్టో ట్రేడింగ్ అనుబంధ కంపెనీ. ఆర్థిక అవాంతరాల కారణంగా ఆర్థిక సంక్షోభం కిందికి వచ్చింది. దాంతో ఎఫ్‌టిఎక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ ఒకేసారి దివాలా తీసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ ఎఫ్‌టీఎక్స్ నుంచి తన ట్రేడింగ్ ఆర్మ్ అల్మెడ రీసెర్చ్‌కు 10 బిలియన్ డాలర్ల కస్టమర్ ఫండ్లను రహస్యంగా బదిలీ చేసింది. ఈ నిధిని ట్రేడింగ్ కోసం అల్మెడ ఉపయోగించింది.
ఈ సంస్థ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూసినప్పుడు లీకైన బ్యాలెన్స్ షీట్‌పై ఒక నివేదికను క్రిప్టో ప్రచురణ సంస్థ కాయిన్‌డెస్క్ ప్రచురించింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత ఎఫ్‌టీఎక్స్‌లో అలజడి మొదలైంది. మూడు రోజుల్లో 6 బిలియన్ డాలర్ల ఉపసంహరణ అభ్యర్థనలు వచ్చాయి. ఒకేసారి పెద్ద ఎత్తున ఉపసంహరణలు రావడంతో ఆర్థిక సంక్షోభం వచ్చింది. విత్‌డ్రాయెల్స్ ప్రాసెస్ చేసే స్థితిలో సంస్థ లేదు. దీని తర్వాత అతను దివాలా అయినట్లు ప్రకటించాడు.