Banks Strike | ఈ నెల 19న బ్యాంకింగ్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. దీంతో ఏటీఎంలతోపాటు బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడనుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. నవంబర్ 19 మూడో శనివారం. సాధారణంగా ప్రతి నెలా తొలి, మూడో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం నోటీసు ఇచ్చారు. తమ సభ్యులు ఈ నెల 19న సమ్మెలోకి వెళ్లాలని ప్రతిపాదించారని ఆ నోటీసు సారాంశం. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ సంగతి బయట పెట్టింది. సమ్మె జరిగిన రోజుల్లో బ్యాంకు శాఖలు, ఆఫీసుల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.
యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న బ్యాంకు ఉద్యోగులను యాజమాన్యాలు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాయిన ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం గత నెలలో ప్రకటించారు. ఇటీవలి కాలంలో యూనియన్‌లో చురుగ్గా పాల్గొంటున్న వారిపై వేధింపులు, దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే వేధింపులు జరుగుతున్నాయన్నారు. ఇది కొంత పిచ్చితనంగా మారుతున్నదని, దీన్ని తాము వ్యతిరేకిస్తామని, ప్రతిఘటిస్తామని తెలిపారు.
సొనాలీ బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న తమ సిబ్బందిని తొలగించాయని వెంకటాచలం ఆరోపించారు. 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక శాఖ నుంచి మరోశాఖకు బదిలీ చేశారని, ఇది బ్యాంకు లెవల్ స్టేట్మెంట్, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమేనన్నారు.