న్యూఢిల్లీ, నవంబర్ 6: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే సర్కారీ బ్యాంకుల ఆర్థికంగా చేయూతనిచ్చి వాటిని బలోపేతం చేయాలని బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ (పీఎస్బీ)ను తక్కువచేసి మాట్లాడవద్దని, ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవను గుర్తించాలని 9 ట్రేడ్ యూనియన్ల అధికారులు, ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) మంత్రి సీతారామన్‌కు సూచించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 90 శాతం ఖాతాలు ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయన్నది. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు, దేశవ్యాప్తంగా మెజారిటీ జనాభాకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందుతున్నది సర్కారీ బ్యాంకులతోనేనని మరువద్దంటూ యూఎఫ్‌బీయూ మంత్రికి చురకలు అంటించింది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ బ్యాంకులను ప్రైవేటీకరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ సేవలను సాధించిన దాఖలాలు లేవంటూ మంత్రి వ్యాఖ్యలను యూనియన్ గట్టిగా ఖండించింది. రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, మహిళలు, గ్రామీణ ప్రజలు, బలహీన వర్గాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేది కేవలం ప్రభుత్వ బ్యాంకులేనని గుర్తుచేసింది.
ప్రైవేటీకరణతో ఉద్యోగ భద్రత దూరమవుతుందని, ఆర్థిక ఫలాలు అందరికీ అందబోవని, జాతీయ-సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పింది. ప్రైవేటీకరణ ఫలాలు కేవలం కార్పొరేట్లకేనని, పౌరులకు కాదన్న యూనియన్.. బ్యాంకింగ్ అనేది ఓ సామాజిక, రాజ్యాంగ బాధ్యత అన్నది. వ్యాపార లాభాల కోసం కాదన్నది. అందుకే ఇకనైనా బ్యాంకులను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని, సరిపడా మూలధన నిధులు సమకూర్చి అన్ని పీఎస్‌బీలను బలోపేతం చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేసింది. పౌరులు, ఉద్యోగులు, డిపాజిటర్లు ప్రభావితమయ్యే ఏ నిర్ణయాలనైనా తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలని, పార్లమెంట్లో అర్థవంతమైన చర్చలు జరుపాలని కూడా ఈ సందర్భంగా కేంద్రానికి ఉద్యోగ సంఘాలు సూచించాయి.
ప్రభుత్వ బ్యాంకుల వల్ల దేశానికి, ప్రజానీకానికి, యావత్తు ఆర్థిక వ్యవస్థకు పైసా ప్రయోజనం లేదన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడటంపట్ల బ్యాంక్ ఉద్యోగ సంఘాల నుంచేగాక పౌర సమాజం నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కతాకు చెందిన ‘బ్యాంక్ బచావో దేశ్ బచావో మంచ్ (బీబీడీబీఎం)’ ఆర్థిక మంత్రికి ఓ లేఖ రాసింది. బ్యాంకుల జాతీయీకరణతో భారత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరిగిందని చెప్పింది. ప్రైవేట్ బ్యాంకులు ఏమాత్రం పట్టించుకోని గ్రామీణ, మోస్తరు పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు 1969 తర్వాతే వచ్చాయని గుర్తుచేసింది. దాంతో అసలు సిసలైన దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు పడ్డాయంటూ మంత్రి అజ్ఞానాన్ని తూర్పారబట్టింది.
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థికాభివృద్ధి, జాతి ప్రయోజనాలకు వచ్చే ఇబ్బందేమీ ఉండబోదన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైమండ్ జూబ్లీ సందర్భంగా మంగళవారం విద్యార్థులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. మున్ముందు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తామని నొక్కిచెప్పారు. ఈ క్రమంలోనే 1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణతో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని పెదవి విరిచారు. బ్యాంకులను జాతీయం చేయడం వల్ల అందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు అందినా.. వ్యవస్థ అన్ప్రొఫెషనల్గానే ఉండిపోయిందని వ్యాఖ్యానించారు. దీనికి కారణం ప్రభుత్వం చేతిలో ఉన్న బ్యాంకులేనని పేర్కొన్నారు. అందుకే బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సత్ఫలితాలుంటాయన్న మంత్రి.. ప్రైవేటీకరణ వల్ల అందరికీ బ్యాంకింగ్ సేవలు అందకుండాపోతాయన్న భావన సరికాదన్నారు.