ముంబై, ఆగస్టు 28 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. కార్లు, మార్ట్గేజ్ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గించింది. రుణ పరిధికి మరింత ఊపునివ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం సాకుగా చూపెడుతూ రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బీవోబీ వడ్డీరేట్లను తగ్గించడం విశేషం.
ప్రస్తుత పండుగ సీజన్లో రుణాలను తీసుకునేవారికి ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియర్ తెలిపారు. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో కార్లపై వడ్డీరేటు 8.40 శాతం నుంచి 8.15 శాతానికి దించింది. నూతన కార్లను కొనుగోలు చేసేవారికి, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా వీరికి ఈ వడ్డీరేటు వర్తించనున్నదన్నారు. అలాగే తాకట్టుకింద పెట్టే ఆస్తులపై ఇచ్చే రుణాలపై వడ్డీరేటును కూడా 9.15 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 9.85 శాతంగా ఉన్నది.