ముంబై, అక్టోబర్ 14: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన 400 రోజుల కాలపరిమితితో ఉత్సవ్ డిపాజిట్ స్కీంపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఈ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.30 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు(80 ఏండ్లకు పైబడిన వారు) 7.95 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ డిపాజిట్ స్కీంలో రూ.3 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చును. 3-5 ఏండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 6.50 శాతం నుంచి 6.80 శాతానికి సవరించింది.
ఐఎస్బీ @ 40 ర్యాంక్
హైదరాబాద్, అక్టోబర్ 14: ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటింది. అంతర్జాతీయంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐఎస్బీకి 40వ స్థానం లభించింది. ఫైనాన్షియల్ టైమ్స్(ఎఫ్టీ) ఇటీవల విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024లో ఈ విషయం వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం ఐఎస్బీకి మాత్రమే చోటు లభించింది.