Fixed Diposits | ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. వాటిల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ముందు వరుసలో నిలుస్తున్నాయి. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ `షాగూన్ 501` పేరుతో కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఖాతాదారులు రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. సాధారణ ఖాతాదారులకు 501 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 8.40 శాతం వడ్డీ లభిస్తుంది.
ఏడు రోజుల నుంచి 500 రోజుల వరకు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై నాలుగు నుంచి 7.35 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు 46 రోజుల నుంచి 10 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బు జమ చేయొచ్చు.
ఏడాది నుంచి పదేండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ముందస్తు విత్ డ్రా చేసుకునే వారికి ఏడు శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. ముందస్తు విత్‌డ్రాయల్‌కు అవకాశం లేని ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రం 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. షాగూన్ 501 స్కీమ్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ఈ నెలాఖరు వరకు మాత్రమే తుది గడువు విధించింది. వివిధ బ్యాంకుల్లో ఖాతాదారుల డిపాజిట్లపై భద్రతకు రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పరిధిలో ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.