January Bank Holidays | మరో ఎనిమిది రోజుల్లో 2022 చరిత్ర కాలగర్భంలో కలిసిపోనున్నది. నూతన వసంతం 2023 మొదలు కానున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ యుగం అయినా, ప్రతి బ్యాంకు ఖాతాదారు కొన్నిసందర్భాల్లో బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు శాఖకు వెళ్లేవారు, సెలవుల జాబితా చెక్ చేసుకుని మరీ వెళితే మంచిది. 2023 జనవరిలో వివిధ రాష్ట్రాల్లో విభిన్న తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం జనవరి 2,4,26 తేదీలను మాత్రమే అధికారిక సెలవులుగా ప్రకటించారు. వీటితోపాటు ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు పని చేయవు.
గెజిటెడ్ సెలవు దినాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులన్నీ మూసి ఉంటాయి. కొన్ని బ్యాంకులను ప్రాంతీయ పండుగలు, సెలవు దినాలను పరిగణనలోకి తీసుకుంటాయి. జనవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు సెలవు దినం. నూతన సంవత్సర ఉత్సవాల నేపథ్యంలో జనవరి రెండో తేదీని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవుగా ప్రకటించింది. మూడో తేదీన మణిపూర్‌లోని ఇంపాల్‌లో ఇమైను ఇరత్పా సందర్భంగా ఇంపాల్‌లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
అసోం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని జెలియాంగ్రాంగ్ ప్రజలు `చకాన్ గాన్ గాయి`గా పేరొందిన గాన్గాయి సందర్భంగా జనవరి నాలుగో తేదీన సెలవుదినంగా ప్రకటించింది ఆర్బీఐ.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభిస్తే, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో గణతంత్ర దినోత్సవంగా ప్రతియేటా జరుపుకుంటున్నారు.
బోగి సందర్భంగా 13న, మకర సంక్రాంతి సందర్భంగా 14న, కనుమ సందర్భంగా 15న కొన్ని ప్రాంతీయ బ్యాంకులు మూసి ఉంటాయి. వీటితోపాటు జనవరి 16న మట్టు పొంగల్, 17న కనుమ పొంగల్ పండుగలను సెలవు దినంగా ఆర్బీఐ ప్రకటించలేదు.