Nationwide Strike | ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వకపోవడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని కేడర్లలో నియామకాలు, వారంలో ఐదురోజుల పని తదితర డిమాండ్లపై చర్చించేందుకు యూఎఫ్బీయూ సభ్యులు ఐబీఏను కలిశారు. ఆయా డిమాండ్లపై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) ప్రధాన కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్బీయూ ఇప్పటికే డిమాండ్లపై సమ్మె ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగి, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ సైతం ఉన్నది. ఆర్థిక సేవల విభాగం (DFS) ఇటీవలి సూచనలను ఉపసంహరించుకోవాలని సైతం యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తున్నది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోపించారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించాలని, పరిమితిని రూ.25లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని యూఎఫ్బీయూ డిమాండ్ చేస్తున్నది. యునైటెడ్ ఫోర్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) ప్రధాన బ్యాంకుల సంఘాలు ఉన్నాయి.