కోల్కతా, జనవరి 27: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ బంధన్ బ్యాంక్.. తమ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు గొప్ప ఊరటనిచ్చింది. స్టాండర్డ్ సేవింగ్స్ అకౌంట్లలో తప్పనిసరిగా ఉండాల్సిన నెలవారీ కనీస నగదు నిల్వల మొత్తాలను రూ.5,000 నుంచి రూ.2,000కు తగ్గించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానున్నది. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో, సాధారణ వినియోగదారులపై ఆర్థిక భారం పడకూడదన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో బ్యాంక్ తెలియజేసింది.
ఖాతాల్లో కనీస నగదు నిల్వల్ని తగ్గించినా.. ఎప్పట్లాగే ఖాతాదారులకు అన్ని ప్రయోజనాలుంటాయని స్పష్టం చేసింది. కాగా, తమ ఈ నిర్ణయం ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు కలిసొస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా బ్యాంక్ ఈడీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజిందర్ బబ్బర్ వ్యక్తం చేశారు.