Bajaj Auto | టేడ్రింగ్లో గురువారం బజాజ్ ఆటో షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 13శాతానికిపైగానే నష్టపోయాయి. కరోనా మహమ్మారి అంటే మార్చి 2020 తర్వాత కంపెనీకి చెందిన షేర్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. కంపెనీ షేర్లు పడిపోవడానికి ప్రధాన కారణం పండుగ సీజన్లో అంచనా వేసిన దానికంటే తక్కువ అమ్మకాలు సాగడమేనని తెలుస్తున్నది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు కంపెనీ షేర్లు 1523.25 పాయింట్లు తగ్గి రూ.10,093.50 వద్ద ముగిసింది. బజాజ్ ఆటో షేర్ల పతనం ద్విచక్ర వాహనరంగానికి ఆందోళన కలిగించే అంశమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, హీరో మోటాకార్ప్ షేర్లు 3.39శాతం తగ్గి రూ.5,214.95 వద్ద ముగిసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్లు 3.43శాతం పతనమై రూ.2,679 వద్ద ముగిసింది.
బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ బుధవారం మాట్లాడుతూ అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్లో మోటార్ సైకిల్ విక్రయాలు ఒకటి నుంచి 2శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. అయితే, ద్విచక్ర వాహన రంగం 5శాతం నుంచి 6శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేయగా.. తక్కువగా పెరుగుతాయని ప్రకటించారు. ఈ క్రమంలో ఊహించినదాని కంటే తక్కువ అమ్మకాలు జరిగే జరుగుతున్నాయన్న అంచనాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ని నిరాశకు గురి చేశాయి. కేవలం బజాజ్ ఆటో షేర్లు మాత్రమే కాకుండా హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ తదితర కంపెనీల షేర్లు సైతం 5శాతం వరకు పడిపోయాయి. బజాజ్ ఆటోలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరించగా.. మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌ని ప్రభావితం చేసింది. సాధారణంగా భారతీయులు పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాలు, కార్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు.
అయితే, ఇటీవల పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరల పెరుగుదల నేపథ్యంలో జేబులపై భారీ ప్రభావం చూపుతున్నది. ఈ క్రమంలో కొనుగోలుదారులకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని రిటైలర్లు ఇటీవల తమ నివేదికలో వెల్లడించారు. ఇక త్రైమాసిక ఫలితాల్లో బజాజ్ ఆటో ఇచ్చిన లాభాల వృద్ధి, మార్జిన్ సమాచారం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ.. కంపెనీ షేరు ఇప్పటికే హై వాల్యుయేషన్‌తో ట్రేడవుతుండడంతో మరింత వృద్ధికి అవకాశం లేకుండాపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని.. ఈ క్రమంలో షేర్లు అమ్ముడవుతున్నాయనన్నారు. ఇది కేవలం బజాజ్ ఆటోకే సవాల్ కాదని.. రాబోయే కాలంలో పరిశ్రమపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.