హైదరాబాద్, ఆగస్టు 29: నగరానికి చెందిన ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్ ప్రచారకర్తగా బాడ్మింటన్ ప్లేయిర్ పీవీ సింధును నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ మాట్లాడుతూ..కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడానికి పీవీ సింధుని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు, వచ్చే నాలుగేండ్ల వరకు ఆమె ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలో వచ్చే మూడేండ్లలో 100 ఎక్స్‌క్లూజివ్ షోరూంలను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. అలాగే దేశవ్యాప్తంగా 500 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించనుండటంతో మొత్తం సంఖ్య 1,000కి చేరుకోనున్నట్లు తెలిపారు.
సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 10 శాతంగా ఉండగా, ఈ ఏడాది 35 శాతం అంచనావేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో మూడు పరుపుల యూనిట్లతోపాటు భువనేశ్వర్‌లో ఉన్న యూనిట్లో ప్రతియేటా 8 లక్షల యూనిట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రతియేటా రూ.25 నుంచి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్లు, ఇందుకోసం ఎలాంటి రుణం తీసుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు. సంస్థ వద్ద నిధులు పుష్కలంగా ఉండటంతో ఇప్పట్లో ఐపీవోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. రూ.10 వేల కోట్ల స్థాయిలో ఉన్న పరుపుల పరిశ్రమలో సంఘటిత రంగం వాటా కేవలం 40 శాతమేనని, అసంఘటిత రంగం 60 శాతంగా ఉన్నదన్నారు. వీటిలో సంస్థ 10 శాతం వాటా కలిగివుండగా, 2026 నాటికి 20 శాతానికి చేరుకోనున్నదని ఆయన అంచనావేస్తున్నారు.