
హైదరాబాద్, నవంబర్ 10: కొనుగోలుదారులకు ఒకేచోట అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి ప్రత్యేక రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నది గోవాకు చెందిన బిలైవ్. దీంట్లోభాగంగా హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సహ-వ్యవస్థాపకుడు సమర్థ ఖోల్కర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఈవీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో వచ్చే మూడేండ్లకాలంలో 15 స్టోర్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా 100 స్టోర్లను ఏర్పాటు చేయడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. వినియోగదారులకు ఒకేచోట అన్ని రకాల ద్విచక్ర వాహనాలను అందించడంతోపాటు ఫైనాన్స్, బీమా, చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యుషన్స్ సైతం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ స్టోర్‌లో హీరో ఎలక్ట్రిక్, గో జిరో లైట్‌స్పీడ్, అంపెర్లకు చెందిన ఈ బైకులు లభించనున్నాయి. ఇక నుంచి ప్రతి నెలలో 3-4 రకాల బ్రాండ్లకు సంబంధించిన బైకులు జతకానున్నాయన్న ఆయన..ఓలా బైకులపై స్పందిస్తూ ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.