హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెప్టెంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసుకున్న సంస్థకు ఈ నెల 5న అనుమతినిచ్చినట్టు సంస్థ వెల్లడించింది. కంపెనీ సమర్పించిన డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం ఫ్రెష్ ఇష్యూతో రూ.240 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో మరో రూ.500 కోట్లు సమీకరించాలని సంస్థ సంకల్పించింది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన షేర్లను ఓఎఫ్ఎస్ రూట్లో విక్రయించనున్నారు.
ఈ వాటా విక్రయంతో కంపెనీ ప్రమోటర్ రాకేశ్ చోప్దార్కు రూ.170 కోట్ల నిధులు సమకూరనుండగా, పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఫండ్‌కు రూ.280 కోట్లు, డీఎంఐ ఫైనాన్స్‌కు రూ.50 కోట్లు లభించనున్నాయి. ఈ ఐపీవో ద్వారా సేకరించిన నిధులను మూలధన వ్యయంతోపాటు రుణాలను చెల్లించడానికి, ఇతర అవసరాల నిమిత్తం వినియోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థ ఏరోస్పేస్, రక్షణ, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్‌కు చెందిన పలు విడిభాగాలను తయారు చేసి విక్రయిస్తున్నది.