Home Loans Costly | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వివిధ రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) సవరించింది. పర్సనల్, ఆటోమొబైల్, హోంలోన్లలో వివిధ టెన్యూర్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచేసింది. పెంచిన ఎంసీఎల్ఆర్ రేట్లు శుక్రవారం (2022 నవంబర్ 18) నుంచే అమల్లోకి వచ్చాయి. న్యూ బెంచ్ మార్క్ ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి గరిష్టంగా 8.60 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తామని తెలిపింది. పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా ఈఎంఐలను సవరిస్తామని పేర్కొంది.
తాజా పెంపుతో ఏడాది టెన్యూర్ గల రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం నుంచి 8.45 శాతానికి పెరుగుతుంది. రెండేండ్ల గడువు గల రుణాలపై 8.45 నుంచి 8.55 శాతానికి, మూడేండ్ల టెన్యూర్ లోన్లపై 8.50 నుంచి 8.60 శాతానికి వడ్డీ పెరుగుతుంది. మూడు నెలల గడువు గల లోన్‌పై 8.25 నుంచి 8.35 శాతానికి, ఆరు నెలల టెన్యూర్ రుణాలపై వడ్డీ 8.30 నుంచి 8.40శాతానికి పెంచేసింది. ఓవర్ నైట్, నెల రోజుల టెన్యూర్ లోన్లపై వడ్డీరేటు 8.15 నుంచి 8.25 శాతానికి పెంచుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
తదుపరి సమీక్ష జరిగే వరకు పెంచిన వడ్డీరేట్లు అమలులో ఉంటాయని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. గత సెప్టెంబర్ 17 నుంచి 9.15 శాతం బేస్ రేట్లో ఎటువంటి మార్పు లేదు. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఈ వడ్డీరేట్ల పెంపు వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.