Axis Bank Rupay Crdit Card | యూపీఐ సేవలకు యాక్సిస్ బ్యాంక్ తన `రూపే` క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానించినట్లు ప్రకటించింది. ఇక నుంచి తమ ‘రూపే’ క్రెడిట్ కార్డు యూజర్లు యూపీఐ క్యూఆర్ కోడ్, మర్చంట్ యూపీఐ చెక్ ఔట్ పేజ్ స్కాన్ చేసి చెల్లింపులు జరుపవచ్చునని తెలిపింది. తద్వారా యూపీఐ ఇన్ స్టంట్ పేమెంట్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని క్రెడిట్ కార్డుపై వచ్చే బెనిఫిట్లను ఎంజాయ్ చేయాలని సూచించింది. రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులను యాక్సిస్ బ్యాంక్ దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నది.
యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సంజీవ్ మోఘే ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘దాదాపు 25 కోట్ల మంది కస్టమర్లు యూపీఐ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి, మర్చంట్ పేమెంట్స్ చేస్తున్నారు. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయడం వల్ల ఐదు కోట్ల యూపీఐ మర్చంట్స్ నెట్ వర్క్ ఆమోదంతో క్రెడిట్ కార్డు యూజర్లకు మరిన్ని పాయింట్లు లభిస్తాయి. ఇప్పటి వరకు తమ కస్టమర్లు బ్యాంకు అకౌంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ మర్చంట్ పేమెంట్స్ చేస్తున్నారు’ అని తెలిపారు.
ఆర్బీఐ పేమెంట్స్ విజన్ -2025 ప్రకారం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల లావాదేవీలు వచ్చే నాలుగేండ్లలో ప్రతి ఏడాది 16 శాతం చొప్పున అభివ్రుద్ధి చెందుతాయి. రోజువారీ లావాదేవీలకూ శరవేగంగా డిజిటల్ చెల్లింపు విధానాన్ని భారతీయులు శరవేగంగా అమలు చేస్తున్నారు. యూపీఐతో క్రెడిట్ కార్డు లింకేజీతో యూపీఐలో చిన్న మొత్తాల చెల్లిపులకు క్రెడిట్ కార్డుల వాడకం మరింత పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తున్నది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు పరిమితమైన యూపీఐ సేవలు.. మున్ముందు పలువురు క్రెడిట్ కార్డు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఎన్పీసీఐ సీఓఓ ప్రవీణ రాయ్ స్పందిస్తూ ‘యూపీఐ పేమెంట్స్‌కు రూపే క్రెడిట్ కార్డులను అనుమతించడం వల్ల కస్టమర్లకు నూతన క్రెడిట్ సొల్యూషన్స్ లభిస్తాయి. దీనివల్ల క్రెడిట్ కార్డు యూజర్లకు నిరంతరరాయంగా యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. వారి క్రెడిట్ పరపతికి అనుగుణంగా బెనిఫిట్లు, రివార్డు పాయింట్లు పొందుతారు’ అని చెప్పారు.
-యూజర్ల బ్యాంకు ఖాతాలను యూపీఐతో లింక్ చేసినట్లే క్రెడిట్ కార్డుతో లింక్ చేయాలి.
– యూపీఐ యాప్స్ లోని బ్యాంకుల జాబితాలో ‘యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు’ ఆప్షన్ ఎంచుకోవాలి.
– మొబైల్ నంబర్ ఆధారంగా యూపీఐ యాప్ తో లింక్ చేసిన రూపే క్రెడిట్ కార్డు.. కస్టమర్‌కి కనిపిస్తుంది.
– కస్టమర్ తన క్రెడిట్ కార్డు లింక్ చేసిన తర్వాత యూపీఐ పిన్ నంబర్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
– కస్టమర్ క్రెడిట్ కార్డు పిన్ నంబర్ కాకుండా ఈ యూపీఐ పిన్ నంబర్ విడిగా వస్తుంది.