ముంబై, జనవరి 24: తాజా పండ్ల దిగుమతిదారు ఐజీ ఇంటర్నేషనల్, ఆర్చర్డ్ అండ్ హార్టికల్చరల్ రిసెర్చ్ సెంటర్ డెక్కన్ ఎగ్జోటిక్స్ కలిసి హైదరాబాద్ సమీపంలో అవకాడోస్ మొక్కల నర్సరీ ఏర్పాటు కోసం జాయింట్ వెంచర్‌ను సోమవారం ప్రకటించాయి. 50:50 నిష్పత్తిలో వాటాలు కలిగిన ఈ జాయింట్ వెంచర్ పేరు ఐజీ దక్కన్. హైదరాబాద్, నగర పరిసరాల్లో ఏర్పాటయ్యే ఈ వెంచర్‌ను దాదాపు రూ.7.5 కోట్ల (1 మిలియన్ డాలర్లు) ప్రారంభ పెట్టుబడితో తెస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో 50 లక్షల చెట్లే లక్ష్యంగా ఈ నర్సరీని ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ఐజీ ఇంటర్నేషనల్ తెలిపింది. తమ ఈ జాయింట్ వెంచర్ అవకాడోస్ మొక్కల పెంపకంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించగలదన్న విశ్వాసాన్ని సంస్థ వ్యక్తం చేసింది. అలాగే అంతర్జాతీయ బ్రీడింగ్ కంపెనీల నుంచి అన్ని రకాల మొక్కలను అందిపుచ్చుకుంటామన్నది. తమ నర్సరీ దేశీయంగా అవకాడోస్ మార్కెట్‌ను పెంచగలదని ఐజీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ తరుణ్ అరోరా అన్నారు.