Aviation Safety | జాతీయ, అంతర్జాతీయ రూట్లలో తిరిగే పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అలర్టయింది. దేశీయ విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్పీకర్ హసన్ సమావేశమైనట్లు సమాచారం. పౌర విమానయాన శాఖకార్యాలయంలో ఈ సమావేశంలో ప్రయాణికుల భదత్రకు తగు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు హెచ్చరికలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా, క్యారియర్లకు నష్టం వాటిల్లకుండా ఈ సమస్య పరిష్కరానికి కృషి చేయాలని బీసీఏఎస్ అధికారులను ఆయా సంస్థల సీఈఓలను కోరింది. ఇందుకు ప్రామాణిక నిర్వహణా (ఎస్వోపీ) విధానాన్ని అమలు చేయాలని సీఈఓలను కోరినట్లు బీసీఏఎస్ అధికారులు చెప్పారు. బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై వివరించాలని ఆయా విమానయాన సంస్థల సీఈఓలను బీసీఏసీ కోరినట్లు తెలుస్తున్నది.
శనివారం ఒక్క రోజే 30కి పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా 70కి పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చాయి. ఆయా బెదిరింపు హెచ్చరికలు వచ్చిన ఐపీ అడ్రస్లు అమెరికా, జర్మనీ, కెనడా, లండన్ కేంద్రాల నుంచి వచ్చినట్లు సమాచారం.