DMart | డీ-మార్ట్ పేరుతో రిటైల్ చైన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్కెట్స్ శుక్రవారం స్టాక్ మార్కెట్లలో అదరగొట్టింది. 2024 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ ఆదాయం 17.5 శాతం సాధించినట్లు రిపోర్ట్ చేయడంతో డీ-మార్ట్ షేర్ 11 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో డీ-మార్ట్ షేర్ రూ.4,023.25ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్ లో 15.12 శాతం వృద్ధితో రూ.4,165 వరకూ దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ఎస్ఈలోనూ 11 శాతం లబ్ధి పొంది రూ.4,011.90 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 15.36శాతం పుంజుకుని రూ.4,165.90 వరకూ దూసుకెళ్లింది. బీఎస్ఈలో డీ-మార్ట్ షేర్లు 6.82 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 92.84 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.
2024 డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో డీ-మార్ట్ 17.5 శాతం వృద్ధితో రూ.15,565.23 కోట్ల స్టాండలోన్ రెవెన్యూ సంపాదించింది. ఏడాది క్రితం 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ.13,247.33 కోట్ల ఆదాయం సముపార్జించింది. దేశవ్యాప్తంగా 387 డీ-మార్ట్ షేర్లు ఉన్నాయని అవెన్యూ సూపర్ మార్ట్స్ శుక్రవారం బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. డీ-మార్ట్‌లో బేసిక్, గృహ వినియోగ వస్తువులు, పర్సనల్ కేర్ వస్తువులు విక్రయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ-ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో డీ-మార్ట్ స్టోర్లు విస్తరించి ఉన్నాయి. దీనికి రాధాకిషన్ దమానీ కుటుంబం ప్రమోటర్‌గా ఉంది.