న్యూఢిల్లీ, అక్టోబర్ 11: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.684.85 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.659.44 కోట్ల లాభంతో పోలిస్తే 3.8 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.45 శాతం ఎగబాకి రూ.14,444.50 కోట్ల నుంచి రూ.16,676.30 కోట్లుగా నమోదైంది. అలాగే నిర్వహణ ఖర్చులు 16 శాతం ఎగబాకి రూ.15,751 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకోలేకపోయామని కంపెనీ సీఈవో అన్షుల్ అసావా తెలిపారు. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో 432 స్టోర్లను నిర్వహిస్తున్నది.