న్యూఢిల్లీ, జూలై 11: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.860.44 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.772.81 కోట్ల లాభంతో పోలిస్తే 11.3 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.9 శాతం ఎగబాకి రూ.18,794.53 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు 15.11 శాతం ఎగబాకి రూ.17,637.17 కోట్లకు చేరుకున్నాయి. కొత్తగా మూడు స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 503కి చేరుకున్నాయి. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల్లో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది.