Bank Service @ Door Step | మీ బ్యాంకు సర్వీసులు మరింత సజావుగా, సురక్షితంగా సాగాలనుకుంటున్నారా..? అందుకు బ్యాంకులు కస్టమర్లను ఆహ్వానిస్తున్నాయి. ప్రత్యేకించి వృద్ధుల ( senior citizens ) కు ఇంటివద్దే బ్యాంక్ సేవలు అందిస్తున్నాయి. భౌతికంగా బ్యాంకు శాఖలకు రానవసరం లేకుండానే వృద్ధుల అత్యవసర బ్యాంకింగ్ టాస్క్‌లను పూర్తి చేస్తున్నాయి. ఇంటి వద్దకే బ్యాంకులు అందించే సేవల్లో 10-ఆర్థికేతర సేవలు పొందొచ్చు. చెక్ పికప్‌తోపాటు నూతన చెక్‌బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్మెంట్ డెలివరీ, 15జీ లేదా 15హెచ్ ఫామ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే బ్యాంకింగ్ సర్వీసెస్ @ డోర్‌స్టెప్ సేవలకు ఆయా బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. డోర్ స్టెప్ వద్దే బ్యాంక్‌లు అందించే సేవలు.. వాటిపై వసూలు చేసే చార్జీల వివరాలేంటో చూద్దామా..!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ.. ఖాతాదారుల రిక్వెస్ట్ మీదే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలందిస్తున్నది. ప్రతి ఆర్థికేతర లావాదేవీకి రూ.60 ప్లస్ జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ.100 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. ప్రతి రోజూ నగదు విత్‌డ్రాయల్ లేదా డిపాజిట్ పరిమితి రూ.20 వేలు. అనునిత్యం సేవల డెలివరీ పూర్తవుతుంది. సాధ్యమైనంత వరకు (సెలవులు మినహా) ఒక్కరోజులోనే డెలివరీ కంప్లీట్ అవుతుంది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారుల్లో వృద్ధులకు డోర్ స్టెప్ సర్వీసులు అందించనున్నది. ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా హెచ్డీఎఫ్సీ ఫోన్ బ్యాంకింగ్ సర్వీసులకు ఫోన్ చేస్తే చాలు. ప్రతి రోజూ కనిష్ఠంగా రూ.5000, గరిష్ఠంగా రూ.25 వేల వరకు నగదు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. ప్రతి క్యాష్ పికప్, డెలివరీకి రూ.200 ప్లస్ టాక్స్‌లు, ఏదేనీ ఇన్స్ట్రుమెంట్ పికప్‌కు రూ.100 ప్లస్ టాక్స్ చెల్లించాలి.
ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల్లోపు వచ్చే రిక్వెస్ట్‌లపై అదే రోజు సర్వీసు డెలివరీ పూర్తవుతుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వచ్చే రిక్వెస్ట్‌లపై ఒకటి లేదా రెండు రోజుల్లో సేవలు అందుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది.
70 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు, కదలలేని వారికి డోర్‌స్టెప్ వద్దే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) .. సేవల ఫెసిలిటీ కల్పిస్తున్నది. ప్రస్తుతం బ్యాంక్ శాఖకు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఖాతాదారుల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఈ సేవలు అందిస్తున్నది. నాన్ ఫైనాన్సియల్ సేవలకు రూ.100 ప్లస్ జీఎస్టీ*, ఫైనాన్సియల్ సేవలకు రూ.100ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది.
మరో ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్.. 60 ఏండ్లు దాటిన ఖాతాదారులకు డోర్ స్టెప్ @ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నది. ఈ ఫెసిలిటీ కేవలం యాక్టివ్ పొదుపు ఖాతా కస్టమర్లకు, రిజిస్టర్డ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.