న్యూఢిల్లీ, డిసెంబర్ 13: వాహన కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు డిస్కౌంట్లను తెరపైకి తీసుకొచ్చాయి. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ఒకవైపు ధరలు పెంచుతున్న సంస్థలు..మరోవైపు పలు మాడళ్లపై భారీగా రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ప్రతియేడాది డిసెంబర్ నెలలో రాయితీలు ప్రకటించే సంస్థలు, డీలర్లు ఈసారి కూడా భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. తమ వద్ద ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి డిస్కౌంట్ల రూపంలో అందిస్తున్నాయి. నూతన సంవత్సరంలో నూతన కార్లను మాత్రమే కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశంతో కొందరు డీలర్లు పాత కారును మాకు ఇచ్చివేయండి..కొత్త కారుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకండని ప్రకటనలు కూడా విడుదల చేశాయి.
దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు ఈసారి ఒక అడుగుముందుకేసి తమ వాహనాలపై రూ.2.4 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్టు ప్రకటించాయి. వీటిలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, హోండా, హ్యుందాయ్‌లు పలు మాడళ్లపై డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాలలో క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు, బీమా, విడిభాగాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నాయి. అత్యధికంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపు ధర కలిగిన మాడళ్లపై అధికంగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి కంపెనీలు.