భారత్లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. ఆటోమొబైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగాచర్యలు తీసుకోవాలి కానీ, ఇతర దేశాల్లో ఉత్పత్తైన కార్లను ఇక్కడికి తెచ్చి విక్రయించడం సరికాదు.
– అనీశ్ షా, మహీంద్రా ఎండీ
Tesla | న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ ఆటోమొబైల్ సంస్థలపై పిడుగుపడింది. ఇప్పుడిప్పుడే ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్న దేశీయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. విదేశీ సంస్థలకు రాచబాట వేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఈవీ పాలసీని ప్రవేశపెట్టడంతో ఆటోమొబైల్ సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఈవీలను ప్రవేశపెట్టిన టాటా, మహీంద్రాతోపాటు ఇతర సంస్థల్లో గందరగోళం నెలకొన్నది. అంతర్జాతీయ ఈవీ దిగ్గజం టెస్లా ప్రవేశించనుండటంతో తమ ఈవీలను కొనుగోలు చేసేవారు తక్కువగా ఉంటారని ఆందోళన చెందుతున్నాయి.
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి తూట్లు పొడుస్తున్నది. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి ఆశయాలకు మోదీ సర్కారు తాజా విధానాలతో పంగనామాలు పెడుతున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించవద్దని ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ సంస్థలు మొరపెట్టుకున్నా కేంద్రం పెడచెవినపెట్టింది. ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడితే దిగుమతి చేసుకునే కార్లపైన సుంకాన్ని తగ్గించనున్నట్లు శుక్రవారం ప్రకటించిన ఈవీ పాలసీలో స్పష్టంచేసింది.
విదేశీ పెట్టుబడిదారుల తాకిడి నుంచి తమను ఆదుకోవాలని దేశీయ ఈవీ వాహన తయారీ సంస్థలు గగ్గొలు పెడుతున్నప్పటికీ కేంద్రం.. కేవలం టెస్లా కోసం మాత్రమే ఈవీ పాలసీని రూపొందించినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. కానీ, డీపీఐఐటీ కార్యదర్శి సింగ్ వ్యాఖ్యలు వేరేవిధంగా ఉన్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్కు మరింత ఊతమిచ్చే విధంగా ఈవీ పాలసీని రూపొందించినట్లు, పలు అంతర్జాతీయ సంస్థలకు దిగుమతి సుంకంపై రాయితీ ఇవ్వడం వల్ల కూడా దేశీయ సంస్థలకు లాభం చేకూరనున్నదని వ్యాఖ్యానించారు. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, కానీ ప్రాంతీయ సంస్థలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని ఆయన చెప్పారు.
విదేశీ సంస్థలకు రాచబాట వేయడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేస్తున్నప్పటికీ వాహన తయారీ సంస్థలు మాత్రం ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి. ప్రతియేటా 8 వేల యూనిట్లను దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు. ఒక్కో సంస్థ ఏటా 8 వేల యూనిట్లు అనుమతి ఉండగా, మొత్తంగా ఐదేండ్లలో 40 వేలకు మించదని ఆయన వ్యాఖ్యానించారు.