Auto Expo | ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆటో ఎక్స్‌పోకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సమీపంలోని జేపీ గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఈ ఎక్స్పో జరుగనున్నది. ఈ షోలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద మొత్తంలో ప్రదర్శనకు రానున్నాయి. దాదాపు 30 కి పైగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు, స్టార్టప్‌లు పాల్గొననున్నాయి. అయితే, హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ వంటి బడా కంపెనీలు ఈ ఎక్స్‌పోకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటో ఎక్స్పో మూడేండ్ల తర్వాత నిర్వహిస్తున్నారు.
ఈ నెల 13 నుంచి 6 రోజుల పాటు కొనసాగే ఆటో ఎక్స్‌పోలో బెనెల్లీ, కీవే, టార్క్ మోటార్స్, మ్యాటర్ ఎనర్జీ, అల్ట్రా వయోలెట్ ఆటోమోటివ్, ఎల్ఎంఎల్ ఈ-మోషన్, యమహా, సుజుకీ వంటి అనేక కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు పెట్టనున్నాయి. ఈసారి ఎల్ఎంఎల్ ఈ-మోషన్ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు అనేక గొప్ప ద్విచక్ర వాహనాలు అలరించనున్నాయి. ఆటో ఎక్స్‌పోకు గ్రేటర్ నోయిడాలోని జేపీ గోల్ఫ్ మైదానం వేదిక కానున్నది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేండ్ల పాటు ఆటో ఎక్స్పో జరగలేదు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో ఎక్స్‌పోలో పాల్గొనేందుకు పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. ఈ ఎక్స్‌పోలో భవిష్యత్‌లో మార్కెట్‌ను అలరించే ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శిస్తారు. చివరిసారి 2020 లో జరిపినప్పుడు 108 ఎగ్జిబిటర్లు, 35 ఓఈఎమ్‌లు పాల్గొనగా.. ఈసారి 114 మంది ఎగ్జిబిటర్లు, 48 మంది వాహన తయారీదారులు పాల్గొననున్నాయి. 15 సంస్థలు కేవలం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీదారులు కావడం విశేషం.