హైదరాబాద్, నవంబర్ 5: ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.848 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అమెరికా, యూరప్ మార్కెట్లో అమ్మకాలు భారీగా పుంజుకోవడం వల్లనే నికర లాభంలో 4 శాతం వృద్ధి సాధ్యమైందని కంపెనీ వైస్-చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.7,796 కోట్ల నుంచి రూ.8,286 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించారు. అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయాలు 3 శాతం ఎగబాకి రూ.3,638 కోట్లకు చేరుకోగా, యూరప్‌లో అమ్మకాలు 18 శాతం ఎగబాకి రూ.2,480 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే భారత్‌లో నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నట్టు, రెండో త్రైమాసికంలో రూ.882 కోట్ల అమ్మకాలు జరిపినట్టు చెప్పారు.