Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు క్రెడిట్ కార్డు పొందడం చాలా ఈజీ.. ప్రత్యేకించి మధ్య తరగతి కుటుంబాలకు చక్కగా వాడుకుంటే క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగం. చిన్న వ్యాపారులు నిత్యం వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు గనుక వారికి క్రెడిట్ కార్డు బాగా ఉపయోగ పడుతుంది. స్వయం ఉపాధిపై జీవనం సాగించే వారి కోసం కొత్తగా ఓ క్రెడిట్ కార్డు వచ్చింది. అదీ ఓ చిన్న బ్యాంక్.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank).. ఎన్పీసీఐ సంస్థ సహకారంతో `రూపే (RuPay)తో జత కట్టింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బిజినెస్ క్యాష్ బ్యాక్ (Business Cashback Rupay Credit Card) క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. స్వయం ఉపాధితో బతికే కస్టమర్లు, బుల్లి వ్యాపారుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఈ క్రెడిట్ కార్డు. చిన్న వ్యాపారులకు విభిన్న శ్రేణుల బెనిఫిట్లు కల్పించడమే లక్ష్యంగా ఆఫర్లు అందిస్తున్నది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సీఈఓ దిలీప్ అస్బేతో కలిసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ కం సీఈవో సంజయ్ అగర్వాల్.. ఈ బిజినెస్ క్యాష్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్రారంభించారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకొచ్చిన బిజినెస్ క్యాస్‌బ్యాక్ రూపే క్రెడిట్ కార్డు.. వ్యాపారుల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను సరళతరం చేసింది. ప్రతి లావాదేవీపై రెండు శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ రుణ పరపతి, 48 రోజుల వడ్డీ రహిత రుణం వంటి ఆఫర్లు అందిస్తున్నది. బిజినెస్ చేసుకునే వారికి పలు అంశాల్లో వన్‌స్టాప్ సొల్యూషన్‌గా ఉంటుంది.
క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఒకశాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒకశాతం ఫ్యుయల్ సర్‌చార్జి రాయితీ పొందొచ్చు. అయితే, కార్డు జారీ అయిన 90 రోజుల తర్వాత అర్హులైన వారికి ఇన్స్టంట్ లోన్ ఫెసిలిటీ లభిస్తుంది. ఏడాదిలో ఎనిమిదిసార్లు ఉచితంగా రైల్వే లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రూ.2 లక్షల వరకు ఫైర్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. సమగ్ర ప్రొటెక్షన్ కవరేజీ ఉంటది. కార్డు లయబిలిటీ కవరేజీ కూడా ఇస్తారు. ట్రావెల్ కవరేజీ కింద రూ.50 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అండ్ పబ్లిక్ లయబిలిటీ కవరేజీ కింద రూ.1.5 లక్షల వరకు క్లయిమ్ చేయవచ్చు.
పిన్ నంబర్ నమోదు చేయకుండానే రూ.5,000 వరకు లావాదేవీలు జరుపవచ్చు. రూ.2000, అంతకంటే ఎక్కువ మొత్తం వాడుకుంటే సులభతర నెలసరి వాయిదాల్లోకి మార్చుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉపయోగించుకోవచ్చు. సిల్వన్ స్పూన్ డైనింగ్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 30శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెలవారీగా కార్డు సభ్యత్వ ఫీజు రూ.99తోపాటు ఇతర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ.10 వేలకుపైగా ఖర్చు చేసిన వారికి నెలవారీ ఫీజు నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది.