Smart SIP | స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే చాలామందికి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్స్) మొదటి ప్రాధాన్యతగా ఉంటా యి. ఇందులో ఎంచుకున్న కాలవ్యవధుల మేరకు మ్యూచువల్ ఫండ్ల ద్వారా నిర్దేశిత మొత్తాలను పెట్టుబడిగా పెడుతూపోవచ్చు. ఉదాహరణకు ప్రతి నెలా 5న రూ.10,000 పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయిస్తే.. నెలనెలా 5న అంతే మొత్తం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఇది కొనసాగుతుంది. దీర్ఘకాలంలో మీరు అధిక రాబడుల్నే అందుకోవచ్చు. అయితే ఇక్కడ ‘స్మార్ట్ సిప్’ అనే ఆప్షన్ కూడా ఉన్నది. మార్కెట్ పరిస్థితులనుబట్టి ప్రయోజనం పొందే వెసులుబాటు దీనిలో కనిపిస్తున్నది. ఫలితంగా ఎక్కువ లాభాలను మదుపరులు ఇందులో అందుకునే వీలున్నదని చెప్పవచ్చు.
స్మార్ట్ సిప్ అంటే ఏమిటి?
మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకుంటూ ఆకర్షణీయ లాభాలను ఒడిసి పట్టుకునేలా రూపొందించినదే ఈ స్మార్ట్ సిప్. ఒక్కమాటలో చెప్పాలంటే సంప్రదాయ సిప్‌కు ఇదో అప్‌గ్రేడ్ వెర్షన్. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పుడు పెట్టుబడులు తగ్గిస్తూ, నష్టాల్లోకి జారుకున్నప్పుడు పెంచుతూపోవచ్చు. తద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని, ఇదే సమయంలో మన పెట్టుబడులపై అధిక రాబడులనూ అందుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఇదీ సంగతి..
మార్కెట్ వాల్యుయేషన్స్ ఆధారంగా పెట్టుబడి మొత్తాలను సర్దుబాటు చేస్తూ స్మార్ట్ సిప్‌లను మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిస్తూ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే తక్కువ కొనడం, ఎక్కువ అమ్మడం వీటి వ్యూహం. స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నప్పుడు మీ మంత్లీ సిప్ (నిర్దేశిత నెలవారీ పెట్టుబడి) మొత్తం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లోకి సాధారణంగానే వెళ్తుంది. కానీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నప్పుడు మీరు పెట్టే పెట్టుబడులు రెట్టింపవుతాయి. అంటే స్టాక్ మార్కెట్లు అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు షేర్ల ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పుడు స్మార్ట్ సిప్‌లో షేర్లను మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు తక్కువగా కొంటుంటారు. లాభాల స్వీకరణకు పెద్దపీట వేసి ఉన్న షేర్లను అమ్మేస్తూ ఉంటారు. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు షేర్ల ధర కూడా తగ్గుతుంది. దీంతో వీలైనంత ఎక్కువగా రకరకాల షేర్లను కొనాలని మేనేజర్లు చూస్తారు. మార్కెట్లు పడుతున్నకొద్దీ ఇలా షేర్లను కొంటూనేపోతుంటారు. అందుకే స్మార్ట్ సిప్‌లో మీరు పెట్టే పెట్టుబడులు రెట్టింపవుతాయి. మార్కెట్ మళ్లీ పుంజుకున్నప్పుడు ఆ షేర్లను ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీంతో పెట్టుబడులకు పెద్దగా ఆస్కారం ఉండదు. ఫలితంగా ఇన్వెస్టర్లకు లాభాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మార్కెట్లు అదేపనిగా పెరుగుతూపోతుంటే పెట్టుబడులను ఈక్విటీ స్కీముల్లో కాకుండా లిక్విడ్ ఫండ్స్‌ల్లోకి మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మళ్లిస్తారు. దీంతో ఆకస్మిక పతనాల నుంచి మదుపరులకు రక్షణ లభిస్తుంది.
స్మార్ట్ సిప్ ఎక్కడ లభ్యం?
ప్రస్తుతం యాక్సిస్ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, కొటక్ ఏఎంసీలు స్మార్ట్ సిప్‌లను ఇన్వెస్టర్లకు ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా ఈ సిప్‌ల్లో ఇన్వెస్టర్లు ఎంచుకున్న కనీస పెట్టుబడి మొత్తాలు ఒక్కోసారి రెట్టింపవుతాయని, మరోసారి తగ్గుతాయని ఆయా ఫండ్ మేనేజర్లు చెప్తున్నారు. అయితే బుల్ మార్కెట్లో స్మార్ట్ సిప్ల నుంచి రెగ్యులర్ సిప్ల కంటే తక్కువగా రిటర్న్స్ రావచ్చని కూడా అంటున్నారు. మార్కెట్ వాల్యుయేషన్స్ ఆధారంగా పెట్టుబడులు తగ్గడమే ఇందుకు కారణం. అయినప్పటికీ బేర్ మార్కెట్లో పెట్టుబడులు పెరుగుతాయి కాబట్టి ఎక్కువ రాబడులు వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. అయినా.. మ్యూచువల్ ఫండ్స్ సిప్‌ల్లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి కనుక అన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడమే శ్రేయస్కరం అన్నది గుర్తుంచుకోవాలి.