న్యూఢిల్లీ: దేశంలోని అన్ని బ్యాంకుల ఎటీఎంలలో ఇవాళ్టి నుంచి సర్వీస్ చార్జీలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులు అనుమతించిన ఉచిత ట్రాన్సక్షన్లను మించి చేసే ప్రతి అదనపు ట్రాన్సక్షన్కు రూ.21 సర్వీస్ చార్జి పడుతుంది. గతంలో రూ.20గా ఉన్న సర్వీస్ చార్జిని రూ.21కి పెంచారు. క్యాష్, నాన్-క్యాష్ ట్రాన్సక్షన్స్ అన్నింటికి ఈ పెంపు వర్తిస్తుంది.
ఇతర పన్నులు కాకుండానే ప్రతి అదనపు ఏటీఎం ట్రాన్సక్షన్కు రూ.21 చార్జి వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇస్తూ గత జూన్ 10న ఆర్బీఐ ఆదేశాల జారీచేసింది. ఈ పెంపు 2022, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సర్వీస్ చార్జి పెంపు అమల్లోకి వచ్చింది. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం కస్టమర్లు తమ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుంచి ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు ట్రాన్సక్షన్లు ఫ్రీగా చేసుకునే అవకాశం ఉన్నది. ఆపై ప్రతి అదనపు ట్రాన్సక్షన్కు సర్వీస్ చార్జీలను వసూలు చేస్తున్నాయి.