ATF | విమానాలు నడపడానికి ఉపయోగించే జెట్ ఫ్యూయల్ (ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ -ఏటీఎఫ్ ATF ) ధరలు కేంద్రం భారీగా తగ్గించింది. ఆర్థిక మాంద్యం భయాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడంతో సోమవారం ఏటీఎఫ్ ధర 12 శాతం తగ్గించింది. కొన్ని వారాల్లో ఏటీఎఫ్ ధర తగ్గించడం ఇది రెండోసారి. దీంతో విమాన టికెట్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గించిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ రూ.16,232.36 తగ్గి రూ.1,21,915.57లకు చేరిందని కేంద్ర చమురు సంస్థలు జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపాయి. జూలై 16వ తేదీన (2.2 శాతం తగ్గింపు) కిలో లీటర్‌పై రూ.3,084.94 తగ్గించిన తర్వాత తాజాగా ఏటీఎఫ్ ధరలో భారీగా కోత విధించడం గమనార్హం.
మరోవైపు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థల్లో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19.2 కిలోలు) ధర స్వల్పంగా రూ.36 తగ్గించడంతో రూ.1976.50కి చేరుకున్నది. గత మే నెల నుంచి వాణిజ్య ఎల్పీజీ (వంట గ్యాస్) సిలిండర్ ధర తగ్గించడం నాలుగోసారి. మే నుంచి ఇప్పటి వరకు వాణిజ్య అవసరాలకు వాడే వంటగ్యాస్ (19 కిలోలు) సిలిండర్ ధర రూ.377.50 తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే సాధారణ కుటుంబాలు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.5 కిలోల వంటింటి ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని రూ.1053 పలుకుతోంది.
అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలకు అనుగుణంగా కేంద్ర చమురు సంస్థలు.. ఏటీఎఫ్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ, 16న సవరిస్తాయి. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర నెలకోసారి సవరిస్తాయి.
జూన్ 16న ఏటీఎఫ్ ధరలు 16 శాతం (కిలో లీటర్‌పై రూ.19,757 పెంచడంతో) రికార్డు స్థాయిలో రూ.1,41,232.87లకు చేరుకున్నది. విమాన సర్వీసుల నిర్వహణలో 40 శాతం ఖర్చు ఏటీఎఫ్కే వెళుతుంది. ఈ నేపథ్యంలో విమాన యాన సంస్థలకు రిలీఫ్ లభించనున్నది. ఆర్థిక మాంద్యం భయాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయంటున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 103.60 డాలర్లు పలికింది. గత వారం 110 డాలర్ల వరకు దూసుకెళ్లింది.
ఇదిలా ఉంటే రిటైల్ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర.. ఢిల్లీలో రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62 పలుకుతున్నది. గత మే 22న పెట్రోల్‌పై రూ.8.69, డీజిల్‌పై రూ.7.05 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. కానీ, ఏప్రిల్ ఆరో తేదీ వరకు లీటర్ పెట్రోల్/డీజిల్ ధర రూ.10 చొప్పున పెరిగింది.