Ashneer Grover-BharatPe | ప్రముఖ మొబైల్ యాప్ ‘భారత్‌పే’ కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్.. కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్‌పే బోర్డు అధికార దుర్వినియోగం చేయడంతోపాటు అణచివేత చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. భారత్‌పే ఎండీ తనను పున: నియమించాలని కోరుతూ ఆయన ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. రీసైలెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Resilient Innovations) బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిద్ద మార్పులు చేసిందని ఆరోపించారు. 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్ పై కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్ కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని కోరారు.
భారత్‌పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలని కోరారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241,242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు ‘న్యాయ ప్రయోజనాల’ కోసం భారత్ పే కంపెనీని మూసేయాలని కోరారు.
ఈ నెల ఆరో తేదీన గ్రోవర్ పిటిషన్ ఎన్సీఎల్టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్‌కు ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించిన అశ్నీర్ గ్రోవర్.. తనకు రిలీఫ్ ఇవ్వకుంటే.. తిరిగి సరిదిద్దలేని రీతిలో నష్టం జరుగుతుందన్నారు. అశ్నీర్ గ్రోవర్ తన పిటిషన్లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు.