Yusuf Mehdi : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Micro Soft) లో 35 ఏళ్లుగా పనిచేస్తున్న కీలక నిపుణుడు, కన్స్యూమర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యూసఫ్ మెహదీ (Yousuf Mehadi) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో మెహదీ ఒకరు. అయితే ఆయన వెంటనే కంపెనీని వీడటం లేదని తెలిపారు. 2027 జూన్ వరకు, అంటే మైక్రోసాఫ్ట్ తదుపరి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఆయన కంపెనీలో కొనసాగుతారు.
ఈ సమయంలో ఏఐ ఆధారిత ఏజెంట్ల కోసం విండోస్‌ను పునర్ నిర్వచించడం, మైక్రోసాఫ్ట్ 365 వృద్ధి, ‘వన్ కోపైలట్’ విజన్‌ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. సున్నితమైన మార్పు ప్రక్రియ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్న్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన మెహదీ.. మైక్రోసాఫ్ట్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలలో భాగమయ్యారు. విండోస్ 3.1, విండోస్ 95, సెర్చ్ ఇంజిన్ బింగ్, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్ 10, ఇటీవలి కోపైలట్ ప్లస్ పీసీల ఆవిష్కరణలలో ఆయన కీలకపాత్ర పోషించారు.
మైక్రోసాఫ్ట్‌లో 35 ఏళ్ల అసాధారణ ప్రయాణం తర్వాత నా తదుపరి సాహసయాత్రను ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నా అని మెహదీ తన మెమోలో పేర్కొన్నారు. సీఈఓ సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ ఏఐపై భారీగా దృష్టి సారిస్తున్న తరుణంలో జరుగుతున్న నాయకత్వ మార్పులలో భాగంగానే మెహదీ నిష్క్రమణను చూస్తున్నారు. ఆయన వారసుడిని ఇంకా ప్రకటించలేదు.