Google | ఆర్థిక మాంద్యం ముప్పు భయంతో దిగ్గజ టెక్ సంస్థలన్నీ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ నిపుణులు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సెర్చింజన్ గూగుల్.. తమ సంస్థలో ఉద్వాసనకు గురైన సిబ్బందికి మరో షాక్ ఇచ్చింది. అమెరికాలోని తమ సంస్థలో పని చేస్తూ ఉద్వాసనకు గురైన ఉద్యోగుల గ్రీన్‌కార్డ్ ప్రక్రియను స్తంభింప జేస్తున్నట్లు సోమవారం తెలిపింది. అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ హోదా పొందాలంటే యాజమాన్యం స్పాన్సర్డ్ గ్రీన్ కార్డు పొందడం తప్పనిసరి.. గూగుల్ తాజా నిర్ణయంతో ఇండియన్ సాఫ్ట్వేర్ నిపుణులకు మరో సమస్య వచ్చి పడింది.
ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డు పొందాలంటే సంబంధిత సంస్థ అధికారులకు ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ (పీఈఆర్ఎం) అంద చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు విదేశీ ఉద్యోగులందరికీ ఈ-మెయిల్ పంపింది. `ఈ వార్తతో మీకు, మీ కుటుంబాలపై కొంత ప్రభావం చూపుతుంది. న్యూ పీఈఆర్ఎం అప్లికేషన్లను నిలిపేయాలని మేం నిర్ణయించాం. కష్టతరమైన ఈ నిర్ణయాన్ని మీకు త్వరితగతిన తెలియజేయాలనుకున్నాం. ఇతర వీసా అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లకు ఈ నిర్ణయం వర్తించదు` అని గూగుల్ కంపెనీ.. ఉద్వాసనకు గురైన తమ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో పేర్కొంది. అయితే, ఇప్పటికే పంపిన `పీఈఆర్ఎం` అప్లికేషన్లకు ఈ నిర్ణయం వర్తించదని తెలిపింది.
ఐటీ వర్కర్ల కోసం పని చేస్తున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ `టీమ్ బ్లైండ్`లో గూగుల్ ఉద్యోగి ఒకరు ఈ ఈ-మెయిల్ పోస్ట్ చేశాడు. గ్రీన్ కార్డు పొందడానికి పీఈఆర్ఎం అప్లికేషన్ తొలి కీలక దశ. యూఎస్‌లో క్వాలిఫైడ్ కాని సిబ్బందికి సంబంధిత సంస్థ పీఈఆర్ఎం అప్లికేషన్ సమర్పించడం అవసరం. తాజాగా టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్.. ఆయా గ్రీన్ కార్డు అప్లికేషన్లను అడిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పీఈఆర్ఎం నిబంధనలు 2005 నుంచి అమల్లో ఉన్నాయి.