Festive Kick for Car Sales | పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న వేళ కార్ల విక్రయాల్లో జోష్ నమోదైంది. కొవిడ్-19 అనంతర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎస్యూవీ మోడల్ కార్లకు గిరాకీ పెరిగింది. ఆగస్టు నెలలో అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ కార్ల విక్రయాల్లో ఆరోగ్యకరమైన గ్రోత్ నమోదైంది. సెమీ కండక్టర్ల కొరతతో గతేడాది ఆగస్టులో కార్ల సేల్స్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ఓనం, గణేశ్ చతుర్థి పండుగల నేపథ్యంలో పెరిగిన కార్ల విక్రయాలు.. నవరాత్రి ఉత్సవాలు, దీపావళి నాటికి మరింత పుంజుకోనున్నాయని భావిస్తున్నారు.
టయోటా భాగస్వామ్యంతో ఆవిష్కరించిన న్యూ ప్రీమియం ఎస్యూవీ `గ్రాండ్ విటారా` సేల్స్ మొత్తం మారుతి సుజుకి విక్రయాల్లో 30 శాతంగా నమోదైంది. మారుతి సేల్స్ గ్రాండ్ విటారా, అప్‌గ్రేడెడ్ బ్రెజా వేరియంట్లు అధిక వృద్ధి నమోదు చేస్తాయని చెబుతున్నారు. మారుతి సుజుకి ప్రత్యర్థిగా ఉన్న హ్యుండాయ్ మోటార్స్ ఆవిష్కరించిన టస్కన్ లగ్జరీ ఎస్యూవీ .. ఆ సంస్థ విక్రయాల్లో ఆరు శాతం వృద్ధి రికార్డయింది. ఆగస్టులో 49,510 కార్లు విక్రయించింది. చిప్‌ల సరఫరా సాధారణ స్థాయికి చేరుకోవడంతో టాటా మోటార్స్‌తో పోటీ పడుతూ హ్యుండాయ్ కార్లు ఉత్పత్తి చేస్తున్నది.
గత నెలలో టాటా మోటార్స్ 47,166 (68 శాతం) కార్లు విక్రయించింది. వీటిలో 3,845 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. మొత్తం కార్ల మార్కెట్లో తన వాటాను శరవేగంగా పెంచుకుంటున్నది. మరో దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ ఒకశాతం పెరిగి 20,138 యూనిట్లకు చేరాయి. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్ వంటి ఆకర్షణీయ మోడల్ కార్ల బుకింగ్స్‌కు డిమాండ్ పెరిగినా డెలివరీలో వెనకబడింది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ కార్లను ముందుకు తేవడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఇండియా సైతం ఎస్యూవీ కార్ల సేల్స్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సెల్టోస్, సొనెట్, కారెన్స్ ఎంపీవీ వేరియంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 22,322 యూనిట్లు విక్రయించింది. పండుగల సీజన్లో సేల్స్ మరింత పెరుగుతాయని ఆశాభావంతో ఉంది కియా మోటార్స్. స్కోడా ఆటోకు చెందిన కుషక్ ఎస్యూవీ, స్లావియా సెడాన్ కార్లకు డిమాండ్ పెరిగింది. మొత్తం 4,222 కార్లు విక్రయించగా కుషక్ ఎస్యూవీ, స్లావియా సెడాన్ మోడల్ కార్ల వాటా 10 శాతంగా ఉంది. గత ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయిలో 37,568 యూనిట్లు విక్రయించింది. 2012లో విక్రయించిన 34,678 కార్ల రికార్డును దాటింది.