హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పారిశ్రామికాభివృద్ధితో తెలంగాణ ఆర్థిక పరిపుష్ఠిని సంతరించుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో ప్రభుత్వం రూపొందించిన కొత్త పాలసీతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం ముందుకు సాగుతున్నది. ఈ విధానంతో తెలంగాణలో పరిశ్రమల స్థాపన సులభతరమైంది. భూ కేటాయింపుల నుండి మౌలిక వసతుల కల్పన, అనుమతుల మంజూరు అన్నింటికీ ఆన్లైన్ విధానం అమలు చేస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకత కారణంగా ఎన్నో బహుళజాతి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. మరెన్నో సంస్థలు ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అలాగే ఎంతోమంది తెలంగాణ యువకులు.. పారిశ్రామికవేత్తలు కావడమేగాక, లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలనూ కల్పించారు.
విస్తారంగా పారిశ్రామిక వాడలు
కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం.. ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీటి పరఫరా, విద్యుత్తు సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తూ ఈ ఇండస్ట్రియల్ పారులను రూపొందించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తూ ఇప్పటివరకు 109 ఇండస్ట్రియల్ పార్క్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు మరో ఐదేండ్లలో 70 పారుల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధమైంది.
3,680 సంస్థలకు భూ కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ఇప్పటిదాకా పారిశ్రామిక పారుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించింది. అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దిన 7,806 ఎకరాల స్థలాన్ని 3,680 సంస్థలకు కేటాయించింది. ఇకడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా 2,63,222 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం దండు మలాపూర్ వద్ద 570 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పారును తెచ్చింది. ఇకడ 4 వేల మంది చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు రూ.1,200 కోట్ల పెట్టుబడులతో తమ వ్యాపారాలను ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
రాష్ట్రంలో ఆహార పంటల దిగుబడులు పెరిగిన నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే రైతులు తమ పంటలను మారెట్‌కు వేగంగా తరలించేందుకు ప్రభుత్వం మెరుగైన రహదారులను నిర్మించింది. అంతేగాక మద్దతు ధర వచ్చేదాకా పండిన పంటను నిల్వ చేసేందుకు గిడ్డంగుల సదుపాయాన్నీ కల్పించింది. ఆహారోత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలు.. తెలంగాణలోనే తమ ఫ్యాక్టరీలను స్థాపించేలా కృషి చేస్తున్నది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు తమ కార్యాలయంలోనే కూర్చొని అనుమతులు పొందేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఆన్లైన్ ద్వారానే అనుమతులు ఇచ్చేలా సులభతరం చేసింది.
రూ.3,654 కోట్ల రాయితీలు
రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు టీ-ఐడియా పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాల కొనుగోలులో వారికి రాయితీలు అందిస్తున్నది. పెట్టుబడి రాయితీ, ల్యాండ్ కాస్ట్ రీయింబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, కరెంట్ బిల్లులో రాయితీ తదితర అవకాశాలను కల్పిస్తున్నారు. వీటితోపాటు అర్హులైనవారికి పావలా వడ్డీకే రుణాలు అందిస్తున్నది ప్రభుత్వం. 2014 నుండి ఇప్పటి వరకు 25,068 మంది యువ పారిశ్రామికవేత్తలకు రూ.3,654.57 కోట్ల రూపాయల రాయితీలను అందించింది.
షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలకు చేయూత
షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు, వికలాంగులకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. టీ-ప్రైడ్ ద్వారా పెట్టుబడి సాయం, మార్జిన్ మనీని అందించడంతోపాటు పెద్దపెద్ద సంస్థల నుండి సబ్ కాంట్రాక్టులు వచ్చేలా చొరవ చూపుతున్నది. పరిశ్రమల నిర్వహణకు దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రదేశం తెలంగాణ అనేలా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నది.