Apple – Jobs | కరోనా మహమ్మారి తర్వాత గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు.. చైనాలో తమ వస్తువుల తయారీని తగ్గించేస్తున్నాయి. అందులో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) కూడా చేరింది. చైనాలో ఐ-ఫోన్లు, ఇతర ఆపిల్ ఉత్పత్తి తగ్గించాలని ఆపిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో తమ ఆపరేషన్స్ విస్తరించడం ద్వారా వచ్చే మార్చి నెలాఖరు నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆపిల్ సంకేతాలిచ్చింది. వాటిలో రెండు లక్షల పత్యక్ష ఉద్యోగాలు ఉంటాయి. అందులోనూ మహిళా ఉద్యోగుల వాటా 70 శాతం ఉంటుంది.
ఇప్పటికే భారత్లో ఆపిల్ ఐ-ఫ్లోన్ల తయారీ సంస్థలు – ఫాక్స్ కాన్, విస్ట్రన్ (ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్), పెగాట్రాన్ కలిసి 80,872 ఉద్యోగాలు కల్పించాయి. టాటా గ్రూప్, సాల్ కాంప్, మదర్సన్, ఫాక్స్ లింక్ (తమిళనాడు), సన్ ఉడా (ఉత్తరప్రదేశ్), ఏటీఎల్ (హర్యానా), జాబిల్ (మహారాష్ట్ర) సంయుక్తంగా సుమారు 84 వేల ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తాయని ఆపిల్, దాని సప్లయర్లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపాయి. ఇటీవలి కాలంలో భారీగా బ్లూ కాలర్స్ ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థగా ఆపిల్ నిలిచింది. ప్రత్యేకించి మహిళలు, టెక్నాలజీ రంగంలో కొత్తగా వచ్చే వారికి ఆపిల్, దాని ఐ-ఫోన్ల తయారీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
2020లో కేంద్రం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద ఆపిల్, దాని ఐ-ఫోన్ల తయారీ సంస్థలు 1.65 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. తమిళనాడులోని హోసూర్ లోని టాటా గ్రూప్ అనుబంధ విస్ట్రన్ సుమారు 50 వేల మంది ఓవర్ టైం ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేసుకుంది. అక్టోబర్ నుంచి ఐ-ఫోన్ల తయారీ ప్రారంభం అవుతుంది.