iPhone Discounts | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తయారు చేసే ఐ-ఫోన్ కొనాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. మిగతాఫోన్లతో పోలిస్తే వీటి ధరలు కాస్త ఎక్కువ. ఏడాదికోసారి కొత్త ఐ-ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మాత్రమే పాత ఐ-ఫోన్ మోడల్స్ ధరలు తగ్గిస్తుంది ఆపిల్. ఐ-ఫోన్ మీద మోజు పెంచుకున్న వారు ఆఫర్లలో ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. కానీ చైనాలో మాత్రం తాజాగా ఆపిల్ తన ఐ-ఫోన్ల ధరల్లో డిస్కౌంట్లు అందిస్తున్నది.
చైనాలో హువావేతోపాటు ఇతర చైనా స్మార్ట్ ఫోన్ల నుంచి ఆపిల్‌కు గట్టి పోటీ ఎదురవుతున్నది. ముఖ్యంగా హువావే విసురుతున్న సవాల్‌తో ఐ-ఫోన్ల సేల్స్ మీద ప్రభావం పడుతోంది. దీనివల్ల ఐ-ఫోన్ల మార్కెట్ వాటాకు గండి పడుతున్నది. దీంతో కలవరానికి గురైన ఆపిల్.. తన ఐ-ఫోన్ల విక్రయాలు పెంచుకోవడానికి నేరుగా తన అధికారిక స్టోర్ లోనే భారీగా ధరలు తగ్గించింది. ఈ నెల 28 వరకూ ధరల తగ్గింపు లభిస్తుంది. తాజా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1టిగా బైట్ వర్షన్ ఫోన్ 318 డాలర్లకే (2300 చైనా యువాన్లు) అందిస్తున్నది. అదే మన కరెన్సీలో రూ.27 వేలు మాత్రమే. ఐ-ఫోన్ 15 బేస్ వేరియంట్ ఫోన్‌పై రూ.16 వేలు (1400 యువాన్లు) డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో చైనాలో ఆపిల్ తన ఐ-ఫోన్ ధరలు తగ్గించడం ఇది రెండోసారి.
ప్రీమియం ఫోన్లలో ఆపిల్ ఐ-ఫోన్లకు హువావే గట్టి పోటీ ఇస్తున్నది. ఇటీవలే హువావే ఆవిష్కరించిన ప్యూరా70 సిరీస్, మేట్ 60 ఫోన్లు ఆ సంస్థ ఫోన్ల విక్రయాల గ్రోత్ కు కారణం అవుతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో హువావే 70 శాతం సేల్స్ పెంచుకుంటే, ఆపిల్ ఐ-ఫోన్ విక్రయాలు 19 శాతం తగ్గాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
గతేడాది తొలి త్రైమాసికంలో చైనా మార్కెట్లో ఆపిల్ -ఫోన్ల వాటా 20 శాతమైతే ఈ ఏడాది 15.7 శాతానికి పతనం కాగా, హువావే సేల్స్ 9.3 నుంచి 15.5 శాతానికి పెరిగాయి. హువావేతోపాటు చైనాలోని ఇతర స్మార్ట్ ఫోన్ల నుంచీ ఆపిల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నది.