Apple : అమెరికా (US), చైనా (China) దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం (Tariffs war) మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈ టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల (iPhone) తయారీకి సంబంధించిన పూర్తి అసెంబ్లీని భారత్‌కు తరలించాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది సాధ్యమైనంత తొందరగానే అమెరికా ఫోన్లకు సంబంధించిన యాపిల్ ఐఫోన్ అసెంబ్లీ భారత్‌కు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పలు ఆంగ్ల మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
2026 నాటికి అమెరికా మార్కెట్ కోసం తయారు చేసే ఐఫోన్ల తయారీ ప్రక్రియ మొత్తం భారత్ కేంద్రంగానే జరిగేలా యాపిల్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు అమెరికా వెలుపల తయారు చేస్తున్న ఐఫోన్లలో భారత్ వాటా 14 శాతం కాగా, దాదాపు 80 శాతం ఐఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. ఇప్పుడు సుంకాల నేపథ్యంలో యాపిల్‌పై అదనపు భారం పడనుంది. చైనా నుంచి అమెరికాకు దిగుమతి చేసుకుంటే 145% పన్ను కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫలితంగా చైనా, భారత్‌లలో తయారయ్యే ఐఫోన్ల ధరల మధ్య అమెరికా మార్కెట్లో భారీ వ్యత్యాసం ఉండనుంది. చైనాతో పోలిస్తే భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల ధరలు తక్కువగా ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ఐఫోన్ల తయారీని భారత్‌కు మార్చాలని యాపిల్ కంపెనీ యోచిస్తోంది. అదే జరిగితే అమెరికా మార్కెట్లో ఇక నుంచి ‘మేక్ ఇన్ ఇండియా’ ఐఫోన్లే కనిపించనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఎన్నికైనప్పుడే చైనాతో వాణిజ్య విరోధం మొదలైంది.
దాంతో చైనా కాకుండా బలమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మరో దేశాన్ని ఎంచుకోవాలని యాపిల్ సహా పలు బహుళజాతి సంస్థలు భావించాయి. అదే సమయంలో స్మార్ట్ఫోన్లపై తయారీ ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తామని 2020లో భారత ప్రభుత్వం ప్రకటించింది. దాంతో యాపిల్ కంపెనీ మన దేశంలో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ కంపెనీ 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను భారత్‌లో తయారు చేసింది.