న్యూఢిల్లీ, జూన్ 25: యాపిల్ మ్యాక్‌బుక్, ఐపాడ్ మాడళ్ల రేట్లు పెరిగాయి. ప్రారంభ శ్రేణి ధరల్నే 20 నుంచి 42 శాతం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో యాపిల్ ప్రియులకు షాకిచ్చినైట్టెంది. కొత్త ధరల వివరాలు యాపిల్ ఇండియా వెబ్సైట్లో ఉన్నాయి. కాగా, మెమరీ చిప్‌ల ఖరీదు వల్లే ధరల్ని పెంచాల్సి వచ్చిందని కంపెనీ చెప్తున్నది. ఇక తాజా నిర్ణయంతో మ్యాక్‌బుక్ ప్రో ధర పెరిగింది. ఇందులో ఎం5 సిరీస్ చిప్‌ను వినియోగించారు. దీంతో ప్రొడక్ట్ విలువ 20 శాతం ఎగిసింది. ఎం5 ప్రో చిప్‌తో ఉన్న 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.2,99,900కు చేరింది.
మునుపు ఇది రూ.2,49,900గా ఉన్నది. అలాగే ఐపాడ్ ఎయిర్ రేట్లూ పెరిగాయి. 13 అంగుళాల ఐపాడ్ ఎయిర్ రేటు 41.22 శాతం ఎగబాకి రూ.1,19,900కు చేరింది. ఇంతకుముందు ఇది రూ.84,900. మ్యాక్‌బుక్ నియో, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ ప్రో వైఫై ధరల్ని యాపిల్ పెంచినట్టు కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ సహవ్యవస్థాపకుడు, రిసెర్చ్ విభాగం వీపీ నీల్ షా తెలిపారు. దీంతో పీసీ, టాబ్లెట్ మార్కెట్లో వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. మొత్తానికి పెరిగిన సెమీకండక్టర్ చిప్‌ల ధరలు.. మెమరీ నుంచి ప్రాసెసర్ల వరకు వ్యయాలను ఎగదోస్తున్నాయి.