హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఎప్పుడూ మొదటి మూడు స్థానాల నుంచి కిందికి దిగలేదని, మన విధానాలను ఆంధ్రప్రదేశ్ కూడా కాపీ కొట్టిందని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ 13వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు. ‘నీతిఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ -2026’లో తెలంగాణ ర్యాంకు 13 స్థానానికి క్షీణించిందని తెలిపారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన పార్టీ నేతలు బొమ్మెర రామ్మూర్తి, రాఘవేంద్రయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో టీఎస్ ఐపాస్ విధానాన్ని నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని, దానిద్వారా 18 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి టీజీ ఐపాస్ ద్వారా వచ్చే పరిశ్రమల సంఖ్య వెయ్యికి పడిపోయిందని, ఐటీ ఉద్యోగాలు కూడా తగ్గాయని దుయ్యబట్టారు. కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీ ఏపీకి తరలిపోవడమే నిదర్శనమని పేర్కొన్నారు.
రేవంత్ దృష్టిలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, అనుముల ఇంటెలిజెన్స్ అని సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ రాష్ట్రంలో బూతుల ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఎల్అండ్టీ సీఎఫ్‌వోను అరెస్ట్ చేస్తానని బెదిరించడం, ఫార్ములా ఈ- రేస్‌పై ఏసీబీ కేసులు పెట్టడం చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు రేవంత్‌రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో టీ-హబ్‌ను కాంగ్రెస్ నేతలు బజ్జీలు, చాయ్ దుకాణాలుగా మార్చాలని చూస్తే, తాము ఆందోళన చేయడం వల్లే శ్రీధర్‌బాబు దానిని ఆపారని గుర్తుచేశారు. టీ-హబ్‌లో ప్రారంభమైన సైరూట్ సంస్థ నేడు రూ.10 వేల కోట్ల పెట్టుబడుల స్థాయికి చేరిందని, అలాంటి వ్యవస్థను నాశనం చేయవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ సంస్కృతిని, గన్‌కల్చర్‌ను రేవంత్‌రెడ్డి వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఏడేండ్లకుపైగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఒక కంపెనీనైనా తెచ్చారా? అని సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌కు రావాల్సిన పెద్ద కంపెనీలను గుజరాత్‌కు తరలించుకొనిపోతుంటే కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. చేతనైతే హైదరాబాద్‌లో కనీసం ఒక కుర్ కురే ఫ్యాక్టరీ అయినా పెట్టించాలని డిమాండ్ చేశారు. ఒక ఫార్మా విలేజ్కైనా కేంద్రం నుంచి అనుమతి తెచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీ కొనుగోలు అంశంలో భారీ అవినీతి జరిగిందని సంజయ్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.