iPhone 16 – Indonesia | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజీ.. కానీ ఇండోనేషియా మాత్రం ఆపిల్ ఐ-ఫోన్లను నిషేధించింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండోనేషియా సరిహద్దుల్లోపల కనిపిస్తే చట్ట విరుద్ధం అని ఆ దేశ పరిశ్రమలశాఖ మంత్రి అగస్ గుమీవాంగ్ కర్టాసాష్మిత ప్రకటించారు. విదేశాల నుంచి ఐ-ఫోన్ 16 ఫోన్లు కొనుగోలు చేయొద్దని యూజర్లను హెచ్చరించారు. ఇండోనేషియాలో పెట్టుబడులు పెడతామని ఇచ్చిన హామీలను ఆపిల్ నిలబెట్టుకోనందు వల్లే ఆపిల్ ఐ-ఫోన్ 16 ఫోన్లపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలో 95 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఆపిల్ హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో 14.75 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది.
ఈ పరిస్థితుల్లో ఆపిల్ ఐ-ఫోన్ 16 ఫోన్ల విక్రయాలకు తమ శాఖ లైసెన్సులు ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి అగస్ గుమీవాంగ్ కర్టాసాష్మిత ప్రకటించారు. అయితే విదేశీ పర్యాటకులకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటికే ఇండోనేషియాలో పర్యటిస్తున్న విదేశీ పర్యాటకులు, పర్యటించనున్న వారు ఆందోళనతో గందరగోళానికి గురవుతున్నారు.
ఐ-ఫోన్ 16 ఫోన్ మీద ‘ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) సర్టిఫికెట్’ వినియోగించనందు వల్లే వాటిని నిషేధించినట్లు కర్టాసాస్మిత చెప్పారు. ‘మీరు దేశంలో ఐ-ఫోన్ 16 ఫోన్ వాడుతున్నట్లయితే అది చట్ట విరుద్ధం అని ఆయన స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా ఐ-ఫోన్ 16 ఫోన్లను వాడుతున్న వారి సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రజలను కోరారు.