Apple Event | ఆపిల్ ఐఫోన్స్ ప్రియులకు గుడ్‌న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఈవెంట్ నేడు జరుగబోతున్నది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో నేడు ‘ఆవ్ డ్రాపింగ్’ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నది. స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగనుండగా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరుగనున్నది. ఈ ఈవెంట్‌ను ఆపిల్ వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఈ ఈవెంట్లో ఐఫోన్ యూజర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించబోతున్నది.
అయితే, ఈ సారి డిజైన్‌లో భారీ మార్పులు ఉండనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈవెంట్ ఆపిల్ ఐఫోన్ నాలుగు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేయనున్నది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఇందులో ఐఫోన్ 17 ఎయిర్ ప్రత్యేకంగా నిలువనున్నది. 5.5 మిల్లీమీటర్ల మందంతో ఐఫోన్స్‌లో ఇదే అత్యంత సన్నపాటి ఫోన్‌గా నిలువనున్నది. 6.6 అంగుళాల డిస్ప్లే, ప్రో మోషన్ టెక్నాలజీ, శక్తివంతమైన ఏ19 ప్రాసెసర్‌తో పాటు ఆపిల్ సొంతంగా తయారుచేసిన వై-ఫై చిప్‌పై పని చేయనున్నది. అయితే, ఇందులో ఫిజికల్ సిమ్ స్లాట్ మాత్రం ఉండదు.
కేవలం ఈ-సిమ్ మాత్రమే పని చేయనుందని టాక్. ఈ ఫోన్ ధర సుమారు 900 డాలర్లుగా ఉండవచ్చని పలు నివేదికలు తెలిపాయి. ఇక ఐఫోన్ 17 బేస్ మోడల్లో సరికొత్తగా 120Hz ప్రో మోషన్ టెక్నాలజీతో ఏ19 ప్రాసెసర్‌తో పాటు 48మెగా పిక్సల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈ మోడల్ కనీస ధర 800 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.70వేలకుపైగా ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సారి ప్రో మోడల్స్‌ను పూర్తిగా మార్చేసినట్లు సమాచారం.
రియర్‌లో సెటప్‌ను అడ్డంగా మార్చేనట్టుగా తెలుస్తున్నది. టైటానియం బాడీకి బదులుగా అల్యూమినియం బాడీతో రానున్నట్లు సమాచారం. ఐ19 ప్రో ప్రాసెసర్, 48MP టెలిఫొటో లెన్స్‌తో పాటు ఫ్రంట్, రియర్‌లో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే వీలు కూడా కల్పించనున్నట్లు తెలుస్తున్నది. ప్రో మోడల్లో 6.3 అంగుళాలు, ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్ప్లేతో రానున్నది. ఆయా మోడల్స్ ధరలు వెయ్యి డాలర్లకుపైగా ఉండనున్నట్లు తెలుస్తున్నది. అలాగే, ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఆపిల్ ఎయిర్‌పాడ్ ప్రో3, ఆపిల్ వాచ్ అల్ట్రా 3 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ ఎస్ఈ మోడల్‌ను ఆవిష్కరించనున్నది.