Elon Musk -X | ఎలన్ మస్క్ సారధ్యంలోని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’కు అమెరికన్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎక్స్’లో తమ వాణిజ్య ప్రకటనలు (Ads) నిలిపేస్తున్నట్లు గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్, వాల్ డిస్నీ, ఐబీఎం, ఒరాకిల్, కామ్ కాస్ట్, బ్రావో టెలివిజన్ నెట్ వర్క్, యూరోపియన్ కమిషన్స్, పారామౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ, లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ‘ఎక్స్’లో యూదులకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులకు ఎలన్ మస్క్ మద్దతు పలకడంపై దుమారం చెలరేగింది. ఎలన్ మస్క్ తీరుపట్ల అగ్రరాజ్యం అమెరికా సైతం తీవ్రంగా మండి పడింది.
ఎక్స్ వేదికగా యూదుల వ్యతిరేక యూజర్లతో ఇటీవల ఎలన్ మస్క్ పదేపదే సంభాషణలు జరిపారు. ఈ నేపథ్యంలోనే శ్వేత జాతీయులు, యూదులను కించపరిచేలా ఓ యూజర్ పోస్ట్‌పై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ సైతం.. మస్క్ రియాక్షన్.. ‘యూదు సామాజిక వర్గాన్ని ప్రమాదంలో పడేస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలోనూ మస్క్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. సీఈఓగా మస్క్‌ను తొలగించాలని టెస్లా వాటాదారులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.