న్యూయార్క్ : టెక్ దిగ్గజం యాపిల్ నుంచి తాను వైదొలగితే తర్వాత ఎవరు కంపెనీ పగ్గాలు చేపడతారనే విషయంలో సీఈవో టిమ్ కుక్ (Apple CEO) కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీకి చెందిన వ్యక్తే తన స్ధానంలోకి వస్తారన్న టిమ్ కుక్ ఆ వ్యక్తి ఎవరనేది వెల్లడించలేదు. యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి తాను ఎప్పుడు తప్పుకుంటాననే వివరాలను టిమ్ కుక్ ప్రస్తావించలేదు.
12 ఏండ్ల నుంచి టిమ్ కుక్ యాపిల్ బిగ్ బాస్‌గా కొనసాగుతూ కంపెనీని నూతన శిఖరాలకు చేర్చారు. ఆయన సారధ్యంలో యాపిల్ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. గతంలో తాను పదేండ్లు సీఈవోగా ఉంటానని చెప్పిన కుక్ ఇప్పటికీ కంపెనీకి పెద్దదిక్కుగా ముందుండి నడిపిస్తున్నారు. భవిష్యత్‌లో తన తర్వాతి నాయకుడి విషయంలో యాపిల్ ఆలోచనల గురించి టిమ్ కుక్ ప్రస్తావిస్తూ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, అయితే తమ వద్ద సమగ్ర ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.
తన స్ధానంలో సీఈవోగా బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నించగా, దీని కోసం పలువురిని సిద్ధం చేస్తున్నామని, అయితే తదుపరి బాస్ మాత్రం యాపిల్ నుంచే రావాలన్నది తన ఆలోచనగా టిమ్ కుక్ చెప్పారు. యాపిల్‌లో పని పద్ధతులు తెలిసిన వ్యక్తి అయితే బావుంటుందని వ్యాఖ్యానించారు. యాపిల్ సీఈవోగా తాను ఎంతకాలం కొనసాగుతాననేది చెప్పలేనని పేర్కొన్నారు.