Apple CEO | భారత్‌లో యాపిల్ ఐఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ముంబై, ఢిల్లీలో ఉన్న రెండు స్టోర్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి ఐఫోన్ విక్రయాల ద్వారా భారత్ నుంచి వస్తోన్న ఆదాయం గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే మరో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు (Apple Stores in India) సంస్థ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook) తాజాగా ప్రకటించారు.
‘మొదటి త్రైమాసికంలో రెండు కొత్త స్టోర్లను ప్రారంభించాం. ఢిల్లీ, ముంబైలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. త్వరలోనే భారత్ కస్టమర్లకు నాలుగు కొత్త స్టోర్లను తీసుకురాబోతున్నాం’ అని యాపిల్ సీసీవో వెల్లడించారు. కాగా, కొత్త స్టోర్లను ఏయే నగరాల్లో ప్రారంభిస్తారన్న విషయాన్ని మాత్రం టిమ్ కుక్ వెల్లడించలేదు. అయితే, పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త స్టోర్లను నెలకొల్పనున్నట్లు యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డియర్డ్రి ఓబ్రియాన్ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భారత్‌లో రెండు యాపిల్ స్టోర్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఒకటి ముంబైలోని బీకేసీలో ఉండగా.. మరొకటి ఢిల్లీలోని సాకేత్‌లో ఉంది. వీటిని 2023లో యాపిల్ అందుబాటులోకి తెచ్చింది.
మరోవైపు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్ తాజాగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐఫోన్ విక్రయాలు భారీగా పెరిగి ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు సీఈవో టిమ్ కుక్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్లు అంటే రూ.7.9 లక్షల కోట్లుకు చేరినట్లు తెలిపారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. యూఎస్, యూరప్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, కొరియా సహా పలు దేశాల్లో రికార్డు స్థాయిలో ఆదాయం అర్జించింది. ప్రత్యేకించి భారతదేశంలో యాపిల్ ఐఫోన్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. భారత్ నుంచి వచ్చే ఆదాయం సరికొత్త రికార్డును నెలకొల్పింది’ అని టిమ్ కుక్ వెల్లడించారు.
Also Read..
Tim Cook | టిమ్ కుక్ దివాళీ విషెస్.. ఢిల్లీ ఫొటోగ్రాఫర్ తీసిన పిక్‌ను షేర్ చేసిన యాపిల్ సీఈవో
Bibek Debroy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత