హైదరాబాద్, ఆగస్టు 3: అపోలో హాస్పిటల్స్.. బెంగళూరుకు చెందిన ఆయుర్వైద్ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. బుధవారం ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు సంబంధిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వైద్ హాస్పిటల్స్‌లో అపోలో హాస్పిటల్స్ మెజారిటీ వాటా కొనేందుకు ప్రయత్నిస్తున్నది. రెండు వారాల్లో డీల్ కుదిరే అవకాశాలున్నాయి అంటున్నారు.
అయితే ఇందుకు సంబంధించి అపోలో వర్గాలను సంప్రదించగా వారు ధ్రువీకరించలేదు. ఆయుర్వైద్ హాస్పిటల్స్ వ్యవస్థాపక సీఈవో రాజీవ్ వాసుదేవన్ సైతం స్పందించలేదని సదరు దినపత్రిక పేర్కొన్నది. కాగా, డీల్ జరిగితే ఆయుర్వేద వ్యాపారంలోకి అపోలో హాస్పిటల్స్ అడుగు పెట్టినట్టవుతుంది. ఆయుర్వైద్ హాస్పిటల్స్‌కు కొచ్చి, గురుగ్రామ్, ఉత్తరాఖండ్, బెంగళూరుల్లో 9 దవాఖానలు, క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులతోపాటు చర్మ, ఊపిరితిత్తులు, జీర్ణాశయ సమస్యలకు చికిత్సను అందిస్తున్నారు. అలాగే జీవనశైలి, మెటబాలిక్ డిజార్డర్స్, మానసిక రుగ్మతలకూ వైద్యం చేస్తున్నారు.
నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్), భారతీయ క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపు పొందిన తొలి ఆయుర్వేద దవాఖాన కూడా ఆయుర్వైద్ కావడం విశేషం. 15 ఏండ్ల క్రితం వాసుదేవన్ దీన్ని ప్రారంభించారు. ఇదిలావుంటే గతంలో కూడా 120 ఏండ్ల చరిత్ర ఉన్న కొట్టక్కల్ ఆర్య వైద్యశాలను సొంతం చేసుకోవాలని అపోలో హాస్పిటల్స్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే రోగులు, పరీక్షలకు సంబంధించి విబేధాల కారణంగా చర్చలు ఫలించలేదు.