హైదరాబాద్, జనవరి 4: రాష్ర్టానికి చెందిన ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాల తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్..హైదరాబాద్‌లో మరో ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది. ఇప్పటికే నగరం చుట్టు తొమ్మిది యూనిట్లు ఉండగా, రూ.130 కోట్ల పెట్టుబడితో పదో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు, వచ్చే ఏడాదిన్నరలోగా ఈ యూనిట్ అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ చైర్మన్ నాగేశ్వర్ రావు తెలిపారు. నగరానికి సమీపంలోని జిన్నారం వద్ద 36 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ యూనిట్లో ఆయిల్-గ్యాస్, పెట్రోకెమికల్స్, వంటనూనెలకు సంబంధించి రియక్టర్లను తయారు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ చేతిలో రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, వీటిని వచ్చే ఏడాదిలోగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా రియక్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు, వీటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.540 కోట్లుగా ఉన్న టర్నోవర్, ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఇదే క్రమంలో వచ్చే ఐదేండ్లలో రూ.4 వేల కోట్ల టర్నోవర్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు.
సోమవారం నుంచి ఐపీవో..
వచ్చే సోమవారం నుంచి ఐపీవోకి రాబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. షేరు ధరల శ్రేణిని రూ.133 నుంచి రూ.140గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 1.42 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనుండటంతో రూ.400 కోట్ల వరకు నిధులు సమకూరవచ్చునని తెలిపింది. ఈ నెల 6న ప్రారంభంకానున్న ఐపీవో 8న ముగియనున్నది. ఇన్వెస్టర్లు కనిసంగా 107 ఈక్విటీ షేర్లను బిడ్డింగ్ చేయాల్సివుంటుంది. ఇలా సేకరించిన నిధులను రుణాలను తిరిగి చెల్లింపులు జరపడానికి, వ్యాపార విస్తరణకోసం వినియోగించనున్నది.