శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 18: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అవార్డు వరించింది. తాజాగా ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డును అందుకున్నది. జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ప్రతియేటా ఇచ్చే ఈ అవార్డుకు భారత్ నుంచి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఎంపికైంది. ఈ నెల 17న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈ అవార్డును జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగిందని, ముఖ్యంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేయనున్నట్లు ప్రకటించారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వక, సమర్థత ఆధారంగా ఈ అవార్డుకు ఎంపికైంది. విమానాలకు సంబంధించిన సమాచారం అందించడంలో సిబ్బం ది చురుగ్గా వ్యవహరించడం, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వల్లనే ఇది సాధ్యమైందని పణికర్ తెలిపారు.
ఐదు ఎయిర్‌పోర్ట్‌లకు చోటు
టాప్-100 బెస్ట్ విమానాశ్రయాల్లో దేశానికి చెందిన ఐదింటికి చోటు లభించిందని స్కైట్రాక్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది. వీటిలో ఢిల్లీకి చెందిన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 36వ స్థానం వరించింది. అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్ 69వ స్థానం నుంచి 59వ స్థానానికి మెరుగుపరుచుకున్నది. అలాగే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 61వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇది 65గా ఉన్నది. కానీ, ముంబై ఎయిర్పోర్ట్ ర్యాంక్ మాత్రం 84వ స్థాయి నుంచి 95కి పడిపోయింది. తొలిసారిగా గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చోటు లభించింది.