SEBI – Congress Party | సెబీ చైర్ పర్సన్ మాదాభి పురీ బుచ్ (Madhabi Puri Buch)పై కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. సెబీ చైర్ పర్సన్ హోదాలో ఉంటూనే పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. గతంలో వచ్చిన ఆరోపణలకు మాధాబి పురీ బుచ్, ఆమె భర్త శుక్రవారం సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా తాజాగా ఆరోపణలు గుప్పించారు. సెబీలో ఉంటూనే 2017-23 మధ్య లిస్టెడ్ సెక్యూరిటీల్లో రూ.36.9 కోట్లు ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు. 2018-19లో భారీ మొత్తంలో ట్రేడింగ్ నిర్వహించారన్నారు.
చైనాతోపాటు పలు విదేశీ ఫండ్స్ లోనూ ఆమె పెట్టుబడులు పెట్టారని పవన్ ఖేరా చెప్పారు. నాలుగు అంతర్జాతీయ ఫండ్స్ లో ఆమె పెట్టుబడులు ఉన్నాయని గుర్తు చేశారు. అందులో చైనాకు చెందిన గ్లోబల్ ఎక్స్ ఎంఎస్సీఐ చైనా కన్జూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ఈ పెట్టుబడుల విషయమై ఆమె ఎప్పుడు ప్రకటన చేశారని ప్రశ్నించారు. ఈ సంగతి ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు తెలుసా? అని నిలదీశారు. సెబీ చైర్సన్ మాధాబీ పురీ బుచ్ ఇచ్చిన వివరణను కొట్టి పారేశారు. ఐసీఐసీఐ, మహీంద్రా గ్రూప్ విషయంలో ఆమె వివరణ ఏమాత్రం సరిపోదని స్పష్టం చేశారు.