PF | న్యూఢిల్లీ, మే 4: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ఈపీఎఫ్‌వో చందాదారుల ప్రావిడెంట్ ఫండ్ భారీగా తగ్గనుంది. కొత్త నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగికి.. ఈపీఎఫ్గా యాజమాన్యం చెల్లించే వాటాలో అత్యధిక భాగం ఇక నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (ఈపీఎఫ్) ఖాతాలో కాకుండా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) ఖాతాలో జమచేస్తారు. అంతేకాకుండా ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత పరిమిత వేతనంపై (రూ.15,000) పెన్షన్ కోసం ఈపీఎస్‌కు సబ్సిడీగా ఇస్తున్న 1.16 శాతం మొత్తాన్ని వాస్తవ జీతంపై అధిక పెన్షన్ కోరుకునేవారికి ఇవ్వదు. ఆ 1.16 శాతం సొమ్మును.. ఉద్యోగి ఖాతాకు యాజమాన్యాలు చెల్లించే వాటా నుంచే పెన్షన్ స్కీమ్ కోసం విత్‌డ్రా చేయనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.
2014 సెప్టెంబర్ 1 తర్వాత పదవీ విరమణ చేసినవారికి, సర్వీసులో ఉన్న వారికి వర్తించే అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు/పెన్షనర్లు వారి వాస్తవ బేసిక్ వేతనంలో అదనంగా 1.16 శాతం ఈపీఎస్‌కు చెల్లించాల్సి ఉండగా, దానికి యాజమాన్యాల వాటా నుంచి తీసుకుంటామన్నదే తాజా నోటిఫికేషన్ సారాంశం. ఉద్యోగి ఈపీఎఫ్‌కు యాజమాన్యాలు చెల్లిస్తున్న/చెల్లించిన దాని నుంచి 1.16 శాతం పెన్షన్ స్కీమ్‌కు మళ్లిస్తారని డెలాయిట్ ఇండియా పార్టనర్ అలోక్ అగర్వాల్ తెలిపారు.
అధిక పెన్షన్ కోసం సమర్పించిన దరఖాస్తులో తప్పులు దొర్లాయని భావిస్తే ఆన్లైన్లో ఉద్యోగులు వారి అప్లికేషన్లను డిలీట్ చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది. పొరపాట్లను సరిచేసిన తర్వాత తిరిగి తాజాగా అప్లోడ్ చేసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ఒక తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ‘డిలీట్ అప్లికేషన్’ బటన్‌ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. దరఖాస్తును తొలగించిన తర్వాత..ఉద్యోగి కావాలనుకుంటే వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌కు సరైన వివరాలతో తాజా అప్లికేషన్‌ను ఫైల్ చేయవచ్చని వివరించింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు డిలీట్ బటన్ ఉపయోగించుకోలేరని, ఆ దరఖాస్తుల స్క్రూటినీని ఫీల్డ్ కార్యాలయాల స్క్రూటినీ పూర్తిచేసినప్పటికీ, వారికి కూడా తప్పులు సవరించుకునే అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించింది.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గత గడువు తేదీ అయిన మే 3నాడే (అంతక్రితం రోజే గడువును జూన్ 26కు పెంచింది) పెన్షన్‌ను లెక్కించే పద్ధ్దతిని ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఈ మెథడాలజీ ప్రకారం అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగులు విశ్లేషించుకుని, దరఖాస్తు చేయాలో, వద్దో నిర్ణయించువచ్చు. వివరాలు..