SIM Cards | రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కేంద్రం మరి కొన్ని చర్యలకు సిద్ధమైందని సమాచారం. నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ క్రైమ్ల్లో భాగస్వామ్యం గల సిమ్ కార్డుల రద్దు కోసం కేంద్రం సిద్ధమైందని వినికిడి. ప్రతిపాదిత చర్యలకు కేంద్రం దిగితే 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు కావడంతోపాటు 2.26 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ అవుతాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమీక్షలో సిమ్ కార్డుల కనెక్షన్ల రద్దు కోసం సిద్ధం చేసిన నివేదికను టెలికం శాఖ అధికారులు వెల్లడించారని తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఆదాయం పన్ను విభాగం, సీబీఐ అధికారులు, ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కొత్త సిమ్ కార్డులు జారీ చేస్తున్నప్పుడు ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధన సమర్ధవంతంగా అమలు చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు టెలికం శాఖ అధికారులు తెలిపారు.
కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని గత మార్చిలో మీడియాలో కథనాలు వచ్చాయి. కంబోడియాలో చిక్కుకుపోయిన సుమారు 5000 మంది భారతీయులతో అక్కడి సైబర్ మోసగాళ్లు సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఆ వార్తల సారాంశం. చిక్కుకుపోయిన భారతీయుల ఇష్టానికి వ్యతిరేకంగా.. డేటా ఎంట్రీ పోస్టులకు భారీ వేతనాల ఆశ పెట్టి సైబర్ మోసాలు చేయించారు. టెలీ కాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో భారీ లాభాలొస్తాయని వీరు నమ్మిస్తుంటారు. ఈ సంగతి బయట పడటంతో అప్రమత్తమైన కేంద్రం.. వివిధ శాఖల అధికారులతో కమిటీని నియమించింది.